మోదీకి అమెరికా అత్యున్నత  పురస్కారం 

భారత్, అమెరికాల మధ్య సంబంధాలను పెంచడంతో విశేషంగా కృషి చేస్తున్న  భారత ప్రధాని నరేంద్ర మోదీకి  ‘లెజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని మోదికి  ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 

భారత్‌ను ప్రపంచశక్తిగా మార్చడం కోసం నాయకత్వం వహించినందుకు మోదీకి  ఈ అవార్డును ఇస్తున్నట్లు ట్రంప్ పేరోన్నారు. ప్రధాని మోదీ  తరఫున ఈ అవార్డును అమెరికా భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ నుంచి వైట్‌హౌస్‌లో స్వీకరించారు. ప్రధాని మోడీకి తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసిన తాజా దేశంగా అమెరికా నిలిచింది.

 `అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడంలో నాయకత్వం వహించినందుకు అధ్యక్షుడు ట్రంప్ ‘లెజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోదీకి  ప్రకటించారు. ఈ అవార్డును మోడీ తరపున భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు స్వీకరించారు’ అని అమెరికా  విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

యూఎస్ మిలటరీ విభాగంలో అత్యన్నత పురస్కారంగా భావించే  ఈ అవార్డును ఇతర దేశాల ప్రభుత్వాధినేతలకు ప్రధానం చేస్తారు. గతంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ ప్రధాని షింజో అబేలకు కూడా అమెరికా లిజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కింది.

వివిధ దేశాలలో అత్యున్నత పౌరపురస్కారాన్ని తాజాగా ప్రధాని మోదీ అమెరికా నుండి పొందారు. అంతకు ముందు 2016లో సౌదీ అరేబియా నుండి `ఆర్డర్ అఫ్ అబ్దులాజిజ్ ఆల్ సౌదీ”, స్టేట్ ఆర్డర్ అఫ్ ఘాజి అమిర్ అమానుల్లా ఖాన్, 2019లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి ఆర్డర్ అఫ్ జాయేద్ అవార్డు, రష్యా నుండి సెయింట్ ఆండ్రూ, మాల్దీవీస్ నుండి డిస్టింగిషెడ్ రూల్ అఫ్ మిషన్ ఇజ్జుద్దీన్ పురస్కారాలను పొందారు.