జమిలి ఎన్నికలకు ఎన్నికల కమీషన్ సిద్ధం 

దేశంలో ఒకేసారి పార్లమెంటుకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) సునీల్‌ అరోరా తెలిపారు. ఇందుకోసం అవసరమైన అన్ని చట్టాల్లో శాసన వ్యవస్థ సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. 

వచ్చే ఏడాదిలో ఐదు రాష్ట్రాల శాసనసభలకు సజావుగా ఎన్నికలు నిర్వహించటంపైనే ప్రస్తుతం దృష్టిపెట్టామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఈసీ వెల్లడించారు. కరోనా భయాలు ఉన్నప్పటికీ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. 

‘లోక్‌సభ, శాసన సభల ఎన్నికలు జమిలిగా నిర్వహించేందుకు ఈసీ సిద్ధంగా ఉన్నది. అంతకంటే ముందు చట్టాలకు సవరణలు చేయాలి. అప్పుడే మేం చర్యలు చేపట్టగలం. ఈ అంశంపై నిర్ణయం తీసుకొనే అధికారం ఈసీకి లేదు’ అని స్పష్టంచేశారు. 

కాగా, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటువేసే హక్కును కల్పించాలని కేంద్రానికి లేఖ రాసింది నిజమేనని సునీల్‌ అరోరా తెలిపారు. వచ్చే ఐదు రాష్ర్టాల ఎన్నికల్లోనే ఈ అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లోని భారతీయులకే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కు కల్పించనున్నారన్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. 

గత నెలలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే ఎన్నిక ఆవశ్యకత గురించి ప్రస్తావించడం గమనార్హం. కొన్ని నెలలకోసారి దేశంలో ఏదో ఓ చోట ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని ప్రధాని తెలిపారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానంలోకి మనం మారాలని, అందుకు ఒకే ఓటర్ జాబితా కూడా ఉండాలని ఆయన సూచించారు.

ఈ నేపథ్యంలో అరోరా వ్యాఖ్యలకు ప్రాధాన్యత  ఏర్పడుతున్నది. 2015లో ఇఎం సుదర్శన్ నచ్చియప్పన్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అన్ని ఎన్నికలను పూర్తి చేయాలని లా కమిషన్ 2018 ముసాయిదా నివేదికలోనూ సూచించింది.

జమిలి ఎన్నికలు 2024లో సార్వత్రిక ఎన్నికలతోపాటు జరుగుతాయా, లేక ముందే జరుగుతాయా అన్న అంశంపై కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చలు ప్రారంభమయ్యాయి.  కాగా లోక్‌సభ, శాసన సభల కాలపరిమితిని తగ్గించడం, పెంచడం, రాజ్యాంగంలో సంబంధిత నిబంధనలను సవరించి, రాష్ట్రాల ఆమోదం పొం దడం, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ని సవరించడం ద్వారానే జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని రాజ్యాంగ నిపుణులు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించారు.