తిరుగుబాటుకు 12 మంది జేడీఎస్ ఎమ్యెల్యేలు సిద్ధం!

మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ ఆధిపత్యంలో జేడీఎస్ పార్టీలో ఆయన కుటుంభం సభ్యుల పెత్తనంతో విసుగు చెందిన 12 మంది ఎమ్యెల్యేలు కర్ణాటకలో పార్టీ అధినాయకత్వంపై సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. వీలును బట్టి వారు బిజెపి, కాంగ్రెస్ లలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. 

కాంగ్రెస్ తో అధికారం పంచుకొని, ప్రభుత్వం కూలిపోవడంతో దిగాలు పడి.  ప్రస్తుతం బిజెపికి మద్దతుగా ప్రకటనలు చేయడం ద్వారా ఆ పార్టీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు దేవెగౌడ, ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి ప్రయత్నాలు చేస్తున్నా పార్టీపై వారి పట్టు సన్నగిల్లుతున్నట్లు కనిపిస్తున్నది. 

ఏకపక్ష నిర్ణయాలతో ఎమ్మెల్యేలు విసిగిపోయారని, అందుకే పార్టీని వీడడానికి సిద్ధమైపోయారని జేడీఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేవెగౌడ కుమారులు పార్టీని సమర్థవంతంగా నడిపించలేరన్న అభిప్రాయం పార్టీలో స్థిరపడిపోయిందని ఒక ఎమ్యెల్యే పేర్కొన్నారు.

తమ పట్ల అధిష్ఠానం ఉదాసీన వైఖరిని అవలంబిస్తోందని, తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అధిష్ఠానంపై పార్టీ ఎమ్యెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి, జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్యే ఎస్.ఆర్. శ్రీనివాసన్ ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా,  జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.కే. కుమార స్వామి కూడా బీజేపీ వైపు చూస్తున్నారని కధనాలు వెలువడుతున్నాయి.

  ‘‘12 మంది మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీ, కాంగ్రెస్‌లోకి జంప్ కావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించే నాటికి ఈ సంఖ్య మరింత రెట్టింపు అవుతుంది.’’ అని ఓ ఎమ్మెల్యే వెల్లడించారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి కర్ణాటకలో ఆ పార్టీ రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకరంగా మారనున్నది.