ఐరోపాను వణికిస్తున్న కొత్తరకం వైరస్ 

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కల్లోల పరచి సంవత్సరం అవుతున్న సందర్భంగా యూకేలో బయటపడిన మరో కొత్తరకం వైరస్  ఇప్పుడు ఐరోపాను ప్రధానంగా వణికిస్తుంది.  కొత్త రకం వైరస్‌కు సంబంధించి కేసులు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూ ఉండడంతో రాబోయే క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకులను దృష్టిలో వుంచుకుని ఆదివారం నుండి బ్రటన్‌లో కఠినమైన ఆంక్షలు తీసుకువచ్చినట్లు బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి హాన్‌కాక్‌ తెలిపారు.

లండన్‌ దాటి ఎవరూ బయటకు ప్రయాణాలు చేయకుండా నిలువరించేందుకు అదనుపు పోలీసు బలగాలను రైల్వే స్టేషన్లలో ఇతర ప్రాంతాల్లో మోహరించారు.   ఈ వైరస్ కారణంగా  బ్రిట‌న్‌లో ప‌రిస్థితి చేయి దాటి పోయిందంటూ లండ‌న్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో అక్క‌డి ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది. క్రిస్మ‌స్ సంబ‌రాల‌ను ర‌ద్దు చేసింది. 

వివిధ ఐరోపాతో పాటు పలు దేశాలు ఇప్ప‌టికే యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై నిషేధం విధించాయి.   అంత‌కుముందు ర‌కం వైర‌స్ కంటే ఇది 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుండ‌టం గ‌మ‌నార్హం. ఈ కొత్త ర‌కం వైర‌స్‌ను VUI-202012/01గా గుర్తించారు. ఇతర వేరియంట్ల‌తో పోలిస్తే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని తాము భావిస్తున్న‌ట్లు యూకే ఆరోగ్య శాఖ నిపుణుల బృందం అయిన న్యూ అండ్ ఎమ‌ర్జింగ్ రెస్పిరేట‌రీ వైర‌స్ థ్రెట్స్ అడ్వైజ‌రీ గ్రూప్ వెల్ల‌డించింది.

అయితే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నా.. తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తున్న‌ట్లుగానీ, మ‌ర‌ణాల రేటును పెంచుతున్న‌ట్లుగానీ ఇప్ప‌టి వ‌ర‌కూ తేల‌లేదు. కొన్ని వారాల కింద‌టి వ‌ర‌కూ 10 నుంచి 15 శాతం ఈ కొత్త వేరియంట్ కేసులు ఉండ‌గా.. ఇప్పుడ‌వి 60 శాతానికి పెరిగిన‌ట్లు కింగ్స్ కాలేజ్ లండ‌న్ ప్రొఫెస‌ర్ స్టువ‌ర్ట్ నీల్ వెల్ల‌డించారు.

అయితే ఈ స‌వాలును వ్యాక్సిన్‌లు ఎదుర్కొంటాయ‌ని ప‌లువురు నిపుణులు విశ్వాసం వ్య‌క్తం చేశారు. వివిధ మ్యుటేష‌న్ల‌పై ప‌రీక్షించిన‌ త‌ర్వాతే ఈ వ్యాక్సిన్‌ల‌ను తీసుకొస్తార‌ని వాళ్లు చెబుతున్నారు.  బ్రిటన్‌లో బయటపడిన కొత్త రకం వైరస్‌పై పూర్తి సమాచారం తెలిసేవరకు ప్రజలందరూ జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారించింది. బ్రిటన్‌ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని తెలిపింది. 

అక్కడ వారు చేస్తున్న పరిశోధనల సమగ్ర సమచారాన్ని అందిస్తున్నారని, అది తమకు అందిన వెంటనే ప్రకటిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందని హెచ్చరించింది.   

ఇలా ఉండగా, యూరప్ దేశాలను వణికిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌ను తాము అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఎదురొడ్డగలదని రష్యా డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) సీఈవో కిరిల్ డిమిట్రీవ్ ధీమా వ్యక్తం చేశారు. తమకున్న సమాచారం ప్రకారం ఐరోపాలో వెలుగు చూసిన కొత్త రకం కరోనా స్ట్రైన్‌పై స్పుత్నిక్‌-వి ప్రభావంతంగా పనిచేస్తుందని చెప్పారు. 

ఎస్-ప్రొటీన్ గత పరివర్తనలపైనా స్పుత్నిక్-వి ఎంతో ప్రభావవంతంగా పనిచేసిందని పేర్కొన్నారు.  స్పుత్నిక్-వి టీకా 95 శాతానికి పైగా ప్రభావంతంగా పనిచేస్తున్నట్టు గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.