నేపాల్ పార్లమెంట్ రద్దు సుప్రీంలో సవాల్ 

పార్లమెంట్‌ను రద్దు చేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించేందుకు నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి తీసుకున్న నిర్ణయం “రాజ్యాంగ వ్యతిరేకం” అని ఆరోపిస్తూ నేపాల్ లో నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు మానవహక్కులు, పౌరసమాజ నాయకులను అరెస్ట్ చేశారు. 

మరోవంక,  ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఆదివారం ప్రధాని తీసుకున్న చర్య దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొనే అవకాశాలను పెంచింది. ఓలి చర్య తర్వాత ఏడుగురు మంత్రులు రాజీనామా చేశారు. 2017 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును ఇది ఉల్లంఘిస్తోదని వారు విమర్శించారు. కాగా రద్దును నిరసిస్తూ మూడు పిటిషన్లు దాఖలయ్యాయని సుప్రీంకోర్టు ప్రతినిధి భద్రకాళి పోఖ్రెల్‌ తెలిపారు. 

రాజ్యాంగం కింద పార్లమెంట్‌ను రద్దు చేసే అధికారం ప్రధానికి లేదని పిటిషనర్లలో ఒకరి తరపు లాయర్‌ దినేష్‌ త్రిపాఠి పేర్కొన్నారు. మంత్రివర్గ సూచనల మేరకు సార్వత్రిక ఎన్నికలు జరిపేందుకు ఏప్రిల్‌ 30, మే 10 తేదీలను అధ్యక్షుడు ప్రతిపాదించారు. 

అంటే షెడ్యూలు కన్నా ఏడాదికి పైగా ముందుగానే ఈ ఎన్నికలకు నిర్ణయించారు. ఇటీవల ప్రధాని తన సొంత పార్టీ అయిన నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలోనే మద్దతు కోల్పోయారు. ప్రభుత్వ నిర్ణయాల్లో పార్టీని పక్కకు పెడుతున్నారనేది కొంతమంది సభ్యుల ఆరోపణగా వుంది.

కీలక నియామకాల సమయంలో సభ్యులను పట్టించుకోవడం లేదన్నది కూడా మరో ఆరోపణ. ఇటువంటి సంక్షోభాల నుండి బయటపడాలంటే కొత్తగా ఎన్నికలు నిర్వహించడమే మార్గమని ఓలి మద్దతుదారులు అంటున్నారు.