బ్రిటన్ పార్లమెంట్ కు జులై 4న ముందస్తు ఎన్నికలు

పద్నాలుగేళ్ల కన్సర్వేటివ్‌ ప్రభుత్వం ఓటమి ఖాయమని ఒపీనియన్‌ పోల్స్‌తో సహా అందరూ భావిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (44) అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంటు రద్దుకు రాజు ఆమోదం తెలిపారని, జులై4న పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయని బుధవారం నంబర్‌ టెన్‌ డౌనింగ్‌ స్ట్రీట్‌ వెలుపల నిలబడి ఆయన వెల్లడించారు.
 
తదనుగుణంగా త్వరలోనే పార్లమెంటును రద్దు చేయనున్నట్లు సునాక్‌ తెలిపారు. లండన్‌లో జోరుగా వర్షం కురుస్తున్నవేళ తన అధికారిక నివాసమైన ’10 డౌనింగ్ స్ట్రీట్’ మెట్లపై నిలబడి తడుస్తూనే ఆయన ప్రసంగించారు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు వర్షాకాలంలో జరుగుతాయని ఇంతవరకు చెబుతూ వచ్చిన సునాక్‌ ఆకస్మికంగా ఈ ముందస్తుకు వెళ్లడంలో ఆంతర్యం తెలియనిదేమీ కాదు. ముందస్తు ఎన్నికలతో ఆయన జూదమాడుతున్నారని విశ్లేషకులు పలువురు పేర్కొంటున్నారు. 
బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చిందని సునాక్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా తన హయాంలో సాధించిన విజయాలను సునాక్‌ గుర్తుచేశారు. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుగా ఉందని ప్రధాని సునాక్ తెలిపారు.
‘మన ఆర్థిక వ్యవస్థ ప్రాన్స్, జర్మనీ, యూఎస్​ కంటే వేగంగా అభివృద్ధి చెందుతోంది. అలాగే ద్రవ్యల్బణం కూడా సాధారణ స్థితి చేరుకుందనే శుభవార్తను విన్నా. ఇది మన ప్రభుత్వ ప్రణాళికలు, ప్రయత్నాలు పనిచేస్తున్నాయని చెప్పడానికి సంకేతం. కష్టపడి సాధించిన ఈ ఆర్థిక స్థిరత్వం ప్రారంభం కావాలనే ఉద్దేశంతో నేను ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చాను. తద్వారా మన భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకోవచ్చు. సంతోషంగా గడిపే రోజులు భవిష్యత్తులో వస్తాయి. అయితే ప్రతి ఒక్కరూ ప్రణాళికలకు కట్టుబడి ఉంటే ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు ఉంటాయి. నేను దేశ ప్రజల రక్షణ కోసం కష్టపడి పని చేస్తా’ అని రిషి సునాక్ ఎక్స్ వేదికగా తెలిపారు.
 
పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌కు బాహాటంగా సునాక్‌ ప్రభుత్వం మద్దతు పలకడం, రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ యుద్ధానికి మద్దతుగా నిలబడటం, దేశీయంగా సామాన్యులపై భారాలు మోపి, సంపన్నులకు రాయితీలు ఇవ్వడం, ప్రభుత్వ రంగంలోని రైల్వేలను, ప్రజారోగ్య రంగాన్ని ప్రైవేటీకరించే యత్నాలపైన బ్రిటన్‌ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది.
 
గత నాలుగేళ్లలో నల్గురు ప్రధానులు మారడం బ్రిటన్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తెలియజేస్తోంది. సునాక్‌ మాత్రం తన ప్రభుత్వం ఆర్థిక సుస్థిరతకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిందని, కరోనా సమయంలో చీకట్లో వున్న ప్రజలను ఆదుకునేందుకు చేతనైనంత సాయం చేశామని చెప్పుకొచ్చారు.