* స్వయంప్రతిపత్తి ఆయుధాలపై నిషేధం విధించాలని పిలుపు
ఇటలీలో జరిగిన జి7 ఔట్‌రీచ్ సెషన్‌లో విశిష్ట అతిధిగా పాల్గొన్న పోప్ ఫ్రాన్సిస్ ని ప్రధాని నరేంద్ర మోదీ పలకరించి, కౌగిలింత పంచుకున్నారు. పోప్‌ను వీల్‌చైర్‌లో ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోనితో పాటు సదస్సుకు తీసుకు రాగా ఫ్రాన్స్‌కు చెందిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూరోపియన్ పార్లమెంట్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తో సహా పలువురు నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.
పోప్ బ్రిటీష్ ప్రధానమంత్రి రిషి సునక్‌ను పలకరించిన తర్వాత, ఆయనను ప్రధాని మోదీని అభినందించారు. ప్రధాని వెంటనే 87 ఏళ్ల పోప్‌తో క్లుప్తంగా సంభాషించారు. కాగా, పోప్ ఫ్రాన్సిస్‌ను ప్రధాని మోదీ ఇండియాకు ఆహ్వానించినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. పోప్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారని, ఒకవేళ ఆయన ఇండియాకు వస్తే, గోవాకు కూడా వస్తారని ఆశిస్తున్నట్లు సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించారు. ఓల్డ్ గోవాలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ గ్జావియర్ చర్చి సంబరాలకు పోప్ ఫ్రాన్సిస్‌ను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసినట్లు గోవా సీఎం ఇటీవల తెలిపారు. గోవా జనాభాలో క్రైస్తవులు 27 శాతం ఉన్నారు.
కాగా, ప్రాణాంతకమైన స్వయంప్రతిపత్తి ఆయుధాలపై నిషేధం విధించాలని పోప్ ఫ్రాన్సిస్ సదస్సులో ప్రసంగిస్తూ పిలుపునిచ్చారు. కృత్రిమ మేథస్సు ప్రమాదాలపై ఆయన ప్రస్తావిస్తూ ”సాయుధ ఘర్షణల విషాదాల నేపథ్యంలో ఈ ‘ప్రాణాంతకమైన స్వయంప్రతిపత్తి ఆయుధాలు’ అభివృద్ధి, వినియోగం గురించి అత్యవసరంగా పున:పరిశీలించాల్సి వుంది. అంతిమంగా వాటి వినియోగాన్ని నిషేధించాలి.” అని పోప్ విజ్ఞప్తి చేశారు.
”గొప్పదైన, సక్రమమైన మానవ నియంత్రణను ప్రవేశపెట్టడానికి సమర్ధవంతమైన, నిర్దిష్టమైన నిబద్ధత నుండే ఇది ప్రారంభమవుతుంది. ఒక మానవుని ప్రాణాన్ని తీసేయడానికి యంత్రాలను ఎన్నడూ ఎంపిక చేసుకోరాదు.” అని ఆయన స్పష్టం చేశారు. జి 7 సదస్సుకు హాజరైన తొలి కేథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్, ఆయుధ పరిశ్రమ పట్ల ఎప్పుడూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వుంటారు.
యుద్ధాలు, మరణాల నుండి లాభాలను ఆర్జించరాదని ఆయన హితవు చెప్పారు. కృత్రిమ మేథస్సును ఇప్పటికే యుద్ధ రంగాల్లో ఉపయోగిస్తున్నారు. ఆధునిక యుద్ధ తంత్రాల్లో దీన్ని ఉపయోగించాలన్న ఆలోచన వల్ల పెరిగే ఘర్షణల ముప్పు, నిర్ణయాలు తీసుకోవడంలో మానవుల పాత్ర వంటి అంశాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కృత్రిమ మేథస్సు చాలా భయాందోళనలు కలగచేసే సాధనమని ఆయన వ్యాఖ్యానించారు. ఎఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, అయితే అది సురక్షితమైన, నైతికమైన సాధనం కాదని తేల్చి చెప్పారు. యంత్రాలపై ఆధారపడడం ద్వారా మానవులు తమకు తాము నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని మనం లాగేసుకోరాదని ఆయన హెచ్చరించారు.
More Stories
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా
90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్
2025లో ప్రమాదంలో 47 కోట్ల మంది పిల్లల భవిష్యత్తు