టెక్నాలజీలో గుత్తాధిపత్యానికి స్వస్తి పలకాలి

టెక్నాలజీలో గుత్తాధిపత్యానికి స్వస్తి పలకాలి
టెక్నాలజీలో గుత్తాధిపత్యానికి స్వస్తి పలకాలని భారత ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సమ్మిళిత సమాజానికి పునాది వేసేందుకు సాంకేతికతను సృజనాత్మకంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇటలీలోని అపులియా రీజియన్‌లో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా ఆయన కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రత్యేకంగా మాట్లాడారు. మనం సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించుకోవాలే తప్ప విధ్వంసకరంగా కాదని అభిప్రాయపడ్డారు.  మానవ కేంద్రీకృత విధానం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు భారత్‌ ప్రయత్నిస్తున్నదని మోదీ పేర్కొన్నారు. భారత్‌ ఏఐ మిషన్‌ ప్రాథమిక మంత్రం ‘అందరికీ ఏఐ’ అని చెప్పారు.
 
“సాంకేతికతను సృజనాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. విధ్వంసకరం కాదు. అప్పుడే మనం సమ్మిళిత సమాజానికి పునాది వేయగలుగుతాము. ఈ మానవ- కేంద్రీకృత విధానం ద్వారా భారతదేశం మెరుగైన భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తోంది. కుత్రిమ మేధస్సుపై జాతీయ వ్యూహం రూపొందించిన మొదటి కొన్ని దేశాలలో భారతదేశం ఉంది.  ఈ సంవత్సరం కుత్రిమ మేధస్సు మిషన్‌ను ప్రారంభించాము” అని ప్రధాని మోదీ తెలిపారు. 
 
సాంకేతికతపై మరింత విశదీకరించిన భారత ప్రధాని సాంకేతికత ప్రయోజనాలు సమాజంలోని అన్ని మూలలకు చేరుకునేలా,  అన్నింటిలో అత్యుత్తమ సామర్థ్యాన్ని వెలికితీసేలా అందరూ ప్రయత్నం చేయాలని సూచించారు.  భవిష్యత్తులో కుత్రిమ మేధస్సు పారదర్శకంగా, న్యాయంగా, సురక్షితంగా,  బాధ్యతాయుతంగా ఉండేలా అన్ని దేశాలు కలిసి పనిచేయాలని పిలుపిచ్చారు. 
భారతదేశం ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలతో సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలపై కూడా ఆయన మాట్లాడారు. “టెక్నాలజీని సర్వత్రా ఉపయోగించడం ద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా,  పారదర్శకంగా జరిగింది. ఇంత పెద్ద ఎన్నికల ఫలితాలు కూడా కొన్ని గంటల్లోనే ప్రకటించబడ్డాయి. ఇది ప్రపంచంలో, మానవజాతి చరిత్రలో ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పండుగ. భారత ప్రజలు వరుసగా మూడోసారి వారికి సేవ చేసే అవకాశం కల్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని పేర్కొన్నారు.
 
 “భారతదేశంలో గత ఆరు దశాబ్దాలలో ఇది మొదటిసారి జరిగింది. ఈ చారిత్రాత్మక విజయంలో భారతదేశ ప్రజలు అందించిన ఆశీర్వాదం ప్రజాస్వామ్యానికి విజయం” అని ఆయన చెప్పారు.  భారత దేశపు విధానం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, “ఇంధన రంగంలో భారతదేశం విధానం నాలుగు సూత్రాలపై ఆధారపడి ఉంది – లభ్యత, అందుబాటు, స్థోమత, ఆమోదయోగ్యత. కాప్ కింద చేసిన అన్ని కట్టుబాట్లను సమయానికి ముందే నెరవేర్చిన మొదటి దేశం భారతదేశం.  2070కి ముందు నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాము.” అని ప్రకటించారు. 
 
‘గ్రీన్ ఎరా’ను ప్రవేశపెట్టేందుకు సమిష్టి కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు పర్యావరణం కోసం భారతదేశ జీవనశైలి కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ వ్యక్తిగత స్పర్శ,  ప్రపంచ బాధ్యతతో కూడిన సామూహిక పర్యావరణ ఉద్యమం కోసం ‘ఏక్ పెద్ మా కే నామ్’ (ప్రతి తల్లికి ఒక చెట్టు) పేరుతో జూన్ 5న (ప్రపంచ పర్యావరణ దినోత్సవం) విడుదల చేసిన కొత్త కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రకటించారు