భారత్- చైనా సరిహద్దు వివాదంలో రష్యా జోక్యం చేసుకోదు

భారత్- చైనా సరిహద్దు వివాదంలో రష్యా జోక్యం చేసుకోదు
* రష్యాతో సహకారం తగ్గించుకోవాలని భారత్ పై అమెరికా వత్తిడి!
భారత్- చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం అత్యంత సున్నితమైన అంశమని, ఆ సంబంధాల్లో రష్యా జోక్యం చేసుకోవడం సరైనది కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. అయితే ఇరు దేశాల నాయకులు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ వార్తా సంస్థల అధిపతులతో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
భారత్, చైనా రెండూ రష్యాకు సన్నిహిత మిత్రదేశాలని పేర్కొన్న ఆయన, ఇరు దేశాలతో తమకు బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ వాటి అంతర్గత లేదా ద్వైపాక్షిక అంశాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. ఆసియాలో రష్యా వ్యూహాత్మక సమతుల్యతను వివరిస్తూ, భారత్‌తో తమ సంబంధాలు చైనాకు వ్యతిరేకంగా కాదని, అలాగే చైనాతో ఉన్న సాన్నిహిత్యం భారత్‌తో బంధాలను ప్రభావితం చేయదని పుతిన్ స్పష్టం చేశారు. 
 
ఈ రెండు సంబంధాలు స్వతంత్రంగా, సహజంగా అభివృద్ధి చెందాయని చెప్పారు. భారత్-చైనా-రష్యా త్రైపాక్షిక వేదిక ఏర్పాటుపై ప్రస్తావిస్తూ ఒక దశలో భారత్, చైనా నాయకులను రష్యాలో సమావేశం కావాలని తానే సూచించానని, ఆ ప్రక్రియ ద్వారానే రష్యా-ఇండియా-చైనా వేదిక ఏర్పడిందని గుర్తు చేశారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలపై అప్పట్లో చర్చలు జరిగాయని చెప్పారు. 
 
భారత్-పాకిస్థాన్ సంబంధాలపై స్పందిస్తూ ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యల సంక్లిష్టత తమకు బాగా తెలుసని పేర్కొన్నారు. అదే సమయంలో పాకిస్థాన్ పూర్తిగా చైనా ప్రభావంలో ఉందనే అభిప్రాయాన్ని ఆయన తోసిపుచ్చారు. భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశమని, ఆదేశంతో తమ సంబంధాలను మరింత విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు  పుతిన్ స్పష్టం చేశారు. 
 
రష్యాతో సహకారాన్ని తగ్గించుకోవాలని భారత్‌పై అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు నిష్ఫలమైనవని, అవి అంతర్జాతీయ సంబంధాలకు నష్టం కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు.  భారతదేశ ఆర్థిక వృద్ధిని, ఆ దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. భారత్‌తో ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి రష్యా నిశ్చయించుకుందని, రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

రష్యాతో సంబంధాలను పరిమితం చేయాలంటూ భారత్‌పై పశ్చిమ దేశాలు ఒత్తిడి తెస్తున్నప్పటికీ, దానివల్ల తమపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడలేదని పుతిన్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన, బలమైన నాయకత్వం ఉన్న భారతదేశంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు నిష్పలమని చెప్పారు. ఈ ఒత్తిళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ముఖ్యం కాదని, ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇరు దేశాల బంధానికి ఎటువంటి ఢోకా లేదని, భవిష్యత్తులోనూ ఇరుదేశాల మధ్య స్నేహం ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను తగ్గించుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికాతో భారతదేశానికి ఉన్న అనుబంధం వల్ల రష్యాతో ఉండే చిరకాల సంబంధాలకు ఎటువంటి ఆటంకం కలగదని, భారత్‌ను తాము ఒక “విశ్వసనీయ భాగస్వామి”గా పరిగణిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. 

మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందిస్తూ సమస్యను పరిష్కరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఉక్రెయిన్‌ ను ఒప్పించడమే ఇప్పుడు చేయాల్సిన పని అని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలలో యూరోపియన్ యూనియన్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరించగలవన్న మీడియా వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆయుధాలు సరఫరా చేయడం ఆపి, ఉక్రెయిన్ ను రాజీకి ఒప్పించడం ద్వారానే ఇయు ఈ వివాద పరిష్కారానికి సహాయపడగలదని సూచించారు.

రష్యాకు వ్యూహాత్మక ఓటమిని కలిగించాలని పదేపదే కోరుకునే పశ్చిమ దేశాలను తాము ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అధ్యక్ష పదవీకాలం ముగిసిపోయిందని పేర్కొంటూ అధ్యక్షుడిగా ఆయన చట్టబద్ధతను ప్రశ్నించారు.  ఉక్రెయిన్ సంక్షోభం `ప్రాంతీయ’ సమస్య మాత్రమేనని, కానీ ఇరాన్ సమస్య ప్రపంచ సమస్య అని పేర్కొన్నారు.

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి దోహదపడే ఏ నిర్ణయానికైనా మద్దతు ఇవ్వడానికి రష్యా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రష్యా-భారత్ రక్షణ సంబంధాలపై మాట్లాడిన పుతిన్, బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తిని విజయవంతమైన భాగస్వామ్యానికి ఉదాహరణగా పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రక్షణ రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఐదో తరం సాంకేతికత కలిగిన సు-57 యుద్ధ విమానాల తయారీలో కలిసి పనిచేయాలని భారత్‌కు రష్యా ప్రతిపాదించిందని వెల్లడించారు. ఈ రంగంలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్నారు. ప్రధాన రక్షణ వేదికలు, అధునాతన ఆయుధ వ్యవస్థలకు సంబంధించిన కీలక సాంకేతికతలను భారత్‌తో పంచుకునేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్పారు.