దశాబ్దాలుగా రైతులు కోరుతున్నవే ఈ చట్టాలు 

నేడు తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలు దశాబ్దాల కాలంగా రైతులు కోరుతున్నవే అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వ‌్య‌వ‌సాయ చ‌ట్టాలు రాత్రికి రాత్రి తీసుకొచ్చిన‌వి కావ‌ని, దీని వెనుక ద‌శాబ్దాల పాటు చ‌ర్చ‌లు, సంప్ర‌దింపులు ఉన్నాయ‌ని ప్రధాని స్ఫష్టం చేశారు.  
 
ఢిల్లీలో రైతులు ఆందోళ‌న చేప‌ట్టిన నేప‌థ్యంలో శుక్ర‌వారం మ‌ధ్య‌ప్ర‌దేశ్ రైతుల‌తో వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ గ‌తంలో పార్టీల మేనిఫెస్టోలు చూసినా ఇవే హామీలు క‌నిపిస్తాయని మోదీ తెలిపారు. 
 
 ఇత‌ర దేశాల రైతులు కొత్త కొత్త టెక్నాల‌జీల‌తో ముందుకు దూసుకెళ్తున్న వేళ మ‌న దేశ రైతులు వెనుక‌బ‌డేలా చేయ‌డం స‌మంజ‌సం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నవారికి హితవు చెప్పారు. 
 
ప్ర‌తిప‌క్షాలు తాము రాజ‌కీయంగా ల‌బ్ధి పొంద‌డానికి రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్రతిప‌క్షాల‌కు చ‌ట్టాల‌తో ఎలాంటి స‌మ‌స్యా లేదు. కానీ వాళ్లు హామీ ఇచ్చిన నెర‌వేర్చ‌లేని దానిని మోదీ చేసి చూపించాడ‌న్న‌దే వారి బాధ‌ అంటూ ధ్వజమెత్తారు.దేశంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, కాస్త ప్రోగ్రేసివ్ భావాలతో ఆలోచించే రైతులు ఈ వ్యవసాయ సంస్కరణలను కోరుకున్నారని మోదీ పేర్కొన్నారు. కొందరి రాజకీయ పునాదులు కూకటి వేళ్లతో సహా కదులుతున్నాయి కాబట్టే, నూతన చట్టాల పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
“నేను చేతులు జోడించి ప్ర‌తిప‌క్షాల‌కు ఒక్క‌టే చెప్ప‌ద‌ల‌చుకున్నాను. ద‌య‌చేసి, మీకు క్రెడిట్ కావాలంటే తీసుకోండి. నేను రాజ‌కీయ పార్టీల మేనిఫెస్టోల‌కు క్రెడిట్ ఇస్తాను” అంటూ ప్రధాని హితవు చెప్పారు. వాళ్లు అధికారంలో ఉన్న‌పుడు స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయ‌లేద‌ని మోదీ విమ‌ర్శించారు.
తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ రిపోర్ట్‌ను వెలికి తీసి అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. కాంగ్రెస్ త‌ప్పుడు హామీల గురించి మ‌ధ్య‌ప్ర‌దేశ్ రైతులకు బాగా తెలుసు అని ఆయ‌న పేర్కొన్నారు. రైతుల‌కు రుణ‌మాఫీ అన్నారు. మ‌రి మీ అంద‌రికీ దాని వ‌ల్ల ల‌బ్ధి క‌లిగిందా అని రైతుల‌ను అడిగారు.
వాళ్లు చిన్న రైతుల‌కు రుణ మాఫీ చేయ‌లేద‌ని, పెద్ద రైతులే దీని వ‌ల్ల ల‌బ్ధి పొందార‌ని ప్రధాని ఆరోపించారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను తొల‌గించే ప్ర‌స‌క్తే లేద‌ని కూడా ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ తమ‌కు ఎంఎస్‌పీని తీసివేసే ఉద్దేశ‌మే ఉంటే.. ఎందుకు స్వామినాథన్ క‌మిష‌న్ రిపోర్ట్‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌శ్నించారు.
తన పదేళ్ల పదవీ కాలంలో కాంగ్రెస్ 50 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని చెప్పుకుందని, తమ హయాంలో మాత్రం ‘కిసాన్ సమ్మాన్ యోజన’ అనే పథకం కింద ప్రతి యేడాది 75 వేల కోట్ల రూపాయలను రైతులకు ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు. రైతులను భ్రమల్లో ఉంచుకోవడం ప్రతిపక్షాలను మానుకోవాలని, ఈ నూతన చట్టాలను అమలులోకి తెచ్చి ఆరు నెలలు గడిచాయని, ఈ ఆరు నెలలు మౌనంగా ఉన్న విపక్షాలు హఠాత్తుగా ఉద్యమాన్ని లేవదీశాయని తీవ్రంగా ధ్వజమెత్తారు.
మ‌ద్ద‌తు ధ‌ర విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా ఉన్న‌ద‌నీ, అందుకే ప్ర‌తి ఏటా పంట వేయ‌కముందే మ‌ద్ద‌తు ధ‌ర‌ను ప్ర‌క‌టిస్తున్నామ‌ని మోదీ చెప్పారు. దీనివ‌ల్ల రైతులు పంట వేసేట‌ప్పుడే సులువుగా లెక్క‌లు వేసుకోగ‌లుగుతార‌ని ఆయ‌న తెలిపారు. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రజలు, రైతులు నమ్మకం ఉంచాలని ప్రధాని అభ్యర్థించారు. మంచి ఉద్దేశాలతోనే ఈ చట్టాలను తీసుకొచ్చామని, ఎలాంటి దురుద్దేశాలూ లేవని తేల్చి చెప్పారు.