జార్ఖండ్‌ సీఎంపై లైంగిక దాడి ఆరోపణ  

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు వ్యతిరేకంగా ముంబైలో నమోదైన లైంగిక దాడి ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌డబ్ల్యూసీ) నివేదిక కోరింది. 2013లో హేమంత్‌ సోరెన్‌, సురేష్‌ నాగ్రే తనపై లైంగిక దాడి చేశారని, దీని గురించి వెల్లడించినందుకు తనను, తన కుటుంబ సభ్యులను బెదిరించారని ముంబైకి చెందిన ఒక మోడల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే కొన్ని రోజుల్లోనే ఆ కేసును ఆమె వెనక్కి తీసుకున్నారు. అయితే లైంగిక దాడి గురించి బాధితురాలు ఏడేండ్ల కిందట స్వయంగా లేఖ రాసినట్లు ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ గుర్తు చేశారు. దీనిపై సమగ్ర నివేదికను సాధ్యమైనంత త్వరలో అందజేయాలని మహారాష్ట్ర డీజీపీకి సూచించారు.

కాగా బీజేపీ ఎంపీ నిషి కాంత్ దుబే ఈ ఏడాది జూలైలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ కేసు మాఫీ కోసం సోరెన్‌ తన సీఎం అధికారాన్ని దుర్వినియోగం చేశారని ట్విట్టర్‌లో ఆరోపించారు. ముంబై పోలీసులు ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. 

దుబే ఆరోపణలపై స్పందించిన సీఎం హేమంత్‌ సోరెన్‌, ఆగస్ట్‌ 4న రాంచీ కోర్టులో రూ 100 కోట్లకు పరువునష్టం దావా వేశారు. బాధిత మహిళతో ఎలాంటి సెటిల్‌మెంట్‌ చేసుకోలేదని, దుబే ట్వీట్‌ చేసేంత వరకు ఈ కేసు సంగతి తనకు తెలియదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 

తనకు వ్యతిరేకంగా ఎలాంటి ట్వీట్లు చేయకుండా దుబేను నిరోధించాలని కోర్టును కోరారు. మరోవైపు ఈ నెల 21న ఈ కేసుపై కోర్టు విచారణ జరుపనున్నది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డీపీజీ నుంచి ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ నివేదిక కోరడం ప్రాధాన్యత సంతరించుకున్నది.