వ్యవసాయ చట్టాలను కేజ్రీవాల్ చించేయడంపై బిజెపి ఆగ్రహం 

వ్యవసాయ చట్టాలను కేజ్రీవాల్ చించేయడంపై బిజెపి ఆగ్రహం 

ఢిల్లీ అసెంబ్లీలో వ్యవసాయ చట్టాల కాపీలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చించేయడంపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ గెజిట్‌లో నోటిఫై చేసిన చట్టాలను చించేయడం రాజకీయ అవకాశవామని విమర్శించింది. కేజ్రీవాల్ ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని, రోజుకో విధంగా రంగులు మారుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాని ప్రయత్నిస్తున్నారని బీజేపీ ధ్వజమెత్తింది.

‘‘ఢిల్లీ గెజిట్‌లో నవంబర్ 23న మూడు వ్యవసాయ చట్టాలను నోటిఫై చేశారు. మరి ఇప్పుడు అసెంబ్లీలో చట్టాల కాపీలను చింపాల్సిన అవసరం ఏంటి? ఇది పూర్తిగా అవకాశవాద రాజకీయం” అంటూ బిజెపి ఎంపీ మీనాక్షి లేఖి దుయ్యబట్టారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త ఊసరవెల్లి. రోజుకో రంగు మారుస్తున్నారు. ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు.  ఢిల్లీ గెజిట్‌లో నోటిఫై చేసిన వ్యవసాయ చట్టాల ప్రతులను ఆమె మీడియాకు చూపించారు.

దీనికి ముందు మూడు వ్యవసాయ చట్టాలకు చెందిన ప్రతులను ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చింపేశారు. అనంతర ఆయన మాట్లాడుతూ ‘‘అసెంబ్లీ సాక్షిగా ఈ మూడు వ్యవసాయ చట్టాలను చించేస్తున్నాను. నేను కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచే ఒక విజ్ణప్తి చేస్తున్నాను. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోండి” అంటూ పేర్కొన్నారు. 

 బ్రిటిషర్ల కంటే కూడా దారుణంగా తయారవొద్దు. కరోనా లాక్‌డౌన్‌లో కొంపలు మునిగినట్లు ఈ చట్టాలను ఆమోదింపజేసేంత అవసరం ఏమొచ్చింది? అంటూ ప్రశ్నించారు.