చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు సుప్రీంలో విచారణ

ఓటుకు కోట్లు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. 

ఓటుకు కోట్లు కేసు ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించారని, అయినా ఆ కేసులో ఎసిబి చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు పేరు చేర్చి సిబిఐ దర్యాప్తు జరపాలని కోర్టును అభ్యర్ధించారు. 

ఈక్రమంలో వచ్చే సంవత్సరం 2021 వేసవి సెలవుల తర్వాత జూలై 14న దీన్ని విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. కాగా రాజకీయ నేతల కేసులను త్వరితగతిన విచారణ జరపాలని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపి రేవంత్‌రెడ్డి వర్గం నుంచి ప్రాణహాని ఉందంటూ ఓటుకు కోట్లుకేసులో ఎ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సి)ని ఆశ్రయించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారినందున తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించడంతో పాటు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డిలు ఈ కేసులో కీలక సూత్రధారాలని పేర్కొన్నాడు. 

ఈకేసు పూర్తయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.