ఎంఐఎం, టీఆర్‌ఎస్ విముక్త హైదరాబాద్‌ను సాధిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భరోసా వ్యక్తం చేశారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా శివాజీలా పోరాడతామని ప్రకటించారు.
బీజేపీ కార్పొరేటర్లు అందరితో కలిసి శుక్రవారం భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూనే… అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని నూతన కార్పొరేటర్లు ప్రమాణం చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాత బస్తీకి సిటీకి మెట్రో రైలు ఎందుకు వద్దంటూన్నారని ఆయన ప్రశ్నించారు. సంఘవిద్రోహ శక్తులకు పాతబస్తీ అడ్డాగా మారిందని ఆరోపించారు. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం..తెలంగాణ బీజేపీ సహకరిస్తుందని తెలిపారు.
నగరాభివృద్ధికి బీజేపీ కార్పొరేటర్లు సహకరిస్తారని పేర్కొంటూ అమ్మవారి కృప, దయతోనే అధిక స్థానాల్లో గెలిచామని, అభివృద్ధికి రాజకీయాలకతీతంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం ఉన్నా ప్రభుత్వం తొందరగా ఎన్నికలు నిర్వహించిందని విమర్శించారు. వరద బాధితులకు నష్టపరిహారం ఇచ్చి ఎన్నికలు జరపాలని కోరామని, అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరితో ముందుకు వెళ్లారని ఆరోపించారు.
‘భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే అవకాశం ప్రజలు బీజేపీకి ఇచ్చారు. పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చెందలేదో ప్రజలు ఆలోచించాలి. పాతబస్తా బీజేపీ అడ్డా.. అభివృద్ది చేసి చూపుతాం’ అని సంజయ్ ప్రకటించారు.
కార్పొరేటర్ల కొనుగోలుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ప్రస్తావిస్తూ తమ ఒక్క కార్పొరేటర్‌ను కెలికెతే.. తాము వంద మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కెలుకుతామని హెచ్చరించారు. పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని చెబుతూ ఇప్పటికైనా టీఆర్ఎస్ గుణపాఠం నేర్చుకోవాలని హితవు చెప్పారు.
బీజేపీ కార్పొరేటర్లతో కలిసి వరదసాయం కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ఎన్నికలు అయిపోయాయి.. మరి మేయర్ అభ్యర్థి ఎంపిక ఎందుకు ఆలస్యమవుతోందో సీఎం కేసీఆర్ చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఇంకా రెండు నెలలు సమయం ఉందని చెబుతున్నారని, అలాంటప్పుడు ఎన్నికలు ముందుగా ఎందుకు నిర్వహించారని ఆయన ప్రశ్నించారు. మేయర్ అవకాశం అధికారపార్టీకి లేదని అంటూ అడ్డ దారిలో గెలవాలని ప్రయత్నం చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు.
More Stories
సైనిక వీరులకు వందనం చక్కటి చొరవ
మహారాష్ట్రలో బంధువుల మధ్య మధ్య పోరు
నేటి నుండి 12 రోజుల పాటు కాప్ -29 సదస్సు