టీఆర్ఎస్ తో బీజేపీకి ఏనాడూ పొత్తు లేదని, ప్రజా సమస్యలపై కుస్తీ మాత్రమే ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు గతంలో పొత్తు పెట్టుకున్నాయని, అధికారం పంచుకున్నాయని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలలో కెసీఆర్, హరీష్ రావు మంత్రులుగా పని చేశారని గుర్తు చేశారు. పొత్తు ఏమైనా ఉంటే ఆ రెండు పార్టీల మధ్యే స్నేహం ఉంటుందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించి, బీజేపీని అధికారంలోకి తేవడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో రోడ్లు, మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణ పనులు రాష్ట్ర సర్కార్ అలసత్వం వల్లే నత్తనడకన సాగుతున్నాయని, పలు ప్రాజెక్టులు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం తన వంతు వాటా నిధులు ఇస్తున్నా టీఆర్ఎస్ సర్కార్ తన షేర్ ను రిలీజ్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.
ఎంఎంటీఎస్ విస్తరణకు సంబంధించి కేంద్రం మంజూరు చేసిన దాని కంటే ఎక్కువగానే నిధులు విడుదల చేసిందని చెప్పారు. మెట్రో దారి మళ్లింపు పేరుతో కేసీఆర్ ఆరు నెలలు పనులు ప్రారంభం కాకుండా ఆపారని మండిపడ్డారు. తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన ఎయిమ్స్ ను హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించిందని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే ఆ భవన పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని విమర్శించారు.
దీంతో ఆ భవనాన్ని ఇంత వరకు నిమ్స్ కు ఇవ్వలేదని, నిమ్స్ ను ఎయిమ్స్ కు అప్పగించలేదని పేర్కొన్నారు. కానీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ తో పాటు ఔట్ పేషెంట్ విభాగాలు రన్ అవుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్, మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
More Stories
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు
హైదరాబాద్ నుండి నేరుగా గోవాకు రైలు ప్రారంభం