అశాంతి రేకెత్తించడం కోసం రైతుల వెనుక విపక్షాలు

రైతుల ఉద్యమం మాటున ప్రతిపక్షాలు దేశంలో అశాంతిని రేకెత్తిస్తున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. అంతేకాదు, అయోధ్య రామమందిర నిర్మాణంపై ఉన్న కోపాన్ని రైతుల ఆందోళన మాటన తీర్చుకుంటున్నాయని ఆరోపించారు.

దేశంలో అశాంతి రగిలించేందుకు విపక్షాలు కుట్ర పన్నాయని ధ్వజమెత్తారు. ఏక్‌ భారత్‌- శ్రేష్ఠ భారత్‌గా మనదేశం రూపుదిద్దుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న వారి పనే ఇదని దుయ్యబట్టారు.

తొలుత రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) హామీ కావాలని డిమాండ్‌ చేయడం  ధర్నా వద్ద రైతుల నుంచి తొలుత వినిపించిందిని గుర్తు చేశారు. బరేలీలో రైతులతో జరిగిన సమావేశంలో యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ ఎంఎస్పీ అమలు నుంచి వెనక్కు తగ్గే ప్రశ్నే లేదని కేంద్రం చెబుతున్నదని పేర్కొన్నారు.

‘‘వెనక్కి తగ్గబోమని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు వారిని (రైతులను) ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నాని ప్రశ్నించారు. వారి కోపానికి కారణం అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తుండడమే. రామ మందిర నిర్మాణాన్ని మోదీ ప్రారంభించడమే ఇందుకు కారణం అని యోగి చెప్పుకొచ్చారు.

రైతులకు సాయం చేసేందుకు ప్రధాని మోదీ అద్భుతమైన ప్రయత్నాలు చేస్తున్నారని కొనియాడారు. కమ్యూనిజంలో ఎప్పుడూ నిజం లేదన్న యోగి.. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజం అయిపోతుందని,  రైతుల జీవితాలు బాగుపడడం ఇష్టం లేనివాళ్లే అక్కడున్నరని ధ్వజమెత్తారు.