5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇసి కసరత్తు

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇసి కసరత్తు

వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం (ఇసి) సన్నాహాలు ప్రారంభించింది. త్వరలోనే ఎన్నికల సంఘానికి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు పశ్చిమ బెంగాల్, తమిళనాడులను సందర్శించనున్నారు.

ఇసి సెక్రటరీ జనరల్ ఉమేష్ సిన్హా వచ్చే వారం తమిళనాడును సందర్శించనుండగా డిప్యుటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ త్వరలోనే పశ్చిమ బెంగాల్‌ను సందర్శిస్తారని ఎసి వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి శాసనసభల పదవీ కాలం వచ్చే ఏడాది మే, జూన్ మధ్యలో ముగిసిపోనున్నది.

ఎనికలు జరగనున్న ఈ ఐదు రాష్ట్రాలలో ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంటోంది. గడచిన పదేళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బిజెపి ఇప్పటికే అక్కడ ప్రచారాన్ని ప్రారంభించింది. 

2019 లోక్‌సభ ఎన్నికలలో బెంగాల్‌లోని 42 పార్లమెంట్ స్థానాలలో 18 స్థానాలను గెలుచుకున్న బిజెపి అధికార టిఎంసికి ప్రత్యామ్నాయంగా ఎదిగింది. అస్సాంలో కాంగ్రెస్‌తో బిజెపి ముఖాముఖీ తలపడనుండగా తమిళనాడులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 

ప్రధానంగా రెండు ద్రవిడ పార్టీల ప్రాబల్యంలో ఉండే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయనున్నట్లు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రకటనతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేరళలో ప్రధానంగా పోటీ సిపిఎం నేతృత్వంలోని అధికార ఎల్‌డిఎఫ్, కాంగ్రెస్ సారథ్యంలోని యుడిఎఫ్ మధ్యనే ఉండే అవకాశం ఉంది.