మమతకు మరో ఎమ్యెల్యే దూరం 

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నేతృత్వం లోని తృణమూల్ కాంగ్రెస్‌కు మరోషాక్ తగిలింది. ఆ పార్టీ ఎంఎల్‌ఎ జితేంద్ర తివారీ గురువారం అసనోల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 

పశ్చిమ బర్ధమాన్ జిల్లా టిఎంసి అధ్యక్ష పదవికి కూడా తివారీ రాజీనామా చేశారు. అసనోల్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఇస్తున్న దాదాపు రూ. 2000 కోట్ల నిధులకు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ అడ్డుపడుతోందని, ఆరోపిస్తూ తివారీ ఇటీవల ఆశాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్‌కు లేఖ రాశారు.

పనిచేసేందుకు అవకాశం ఇవ్వనప్పుడు ఆ పదవి నాకెందుకు ?అందుకే రాజీనామా చేశానని తివారీ మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు. అంతకు ముందు పార్టీ లోని విభేదాలపై చర్చించడానికి ఏర్పాటైన సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. 

ఈలోగా పార్టీకి ఇంతకు ముందే రాజీనామా చేసిన టిఎంసి ఎంపి సునీల్ మండల్ ను బుధవారం సాయంత్రం తివారీ కలుసుకున్నారు. అసన్‌సోల్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఆప్ కాలేజీ కి కూడా తివారీ రాజీనామా చేశారు.