అమెరికా అణ్వాయుధ వ్యవస్థలపై సైబర్‌ దాడి    

ప్రపంచంలోనే అత్యంత భద్రమైనవనిగా భావిస్తున్న అమెరికా అణ్వాయుధ వ్యవస్థలపై అసాధారణ సైబర్‌ దాడి జరిగింది. అగ్రరాజ్య ఫెడరల్‌ (కేంద్ర) ప్రభుత్వంతోపాటు పలు రాష్ర్టాల సంస్థలు, ప్రైవేటు కంపెనీల నెట్‌వర్క్‌లపై కూడా ఏకకాలంలో అత్యంత పకడ్బందీగా హ్యాకర్లు దాడులకు పాల్పడ్డారు. వారు ఏదైనా సమాచారాన్ని తస్కరించారా లేదా అన్న అంశంపై అమెరికా నిఘా, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు మొదలుపెట్టాయి.

హ్యాకింగ్‌ వల్ల జరిగిన నష్టాన్ని అంచనావేయటానికే వారాల సమయం పట్టవచ్చని పొలిటికో అనే వార్తాసంస్థ తెలిపింది. సైబర్‌ దాడి విషయాన్ని ప్రభుత్వ అధికారులు గురువారమే ధ్రువీకరించినప్పటికీ అణు వ్యవస్థలపై దాడి విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనర్జీ (డీవోఈ), నేషనల్‌ న్యూక్లియర్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఎన్‌ఎస్‌ఏ), ఫెడరల్‌ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్‌ (ఎఫ్‌ఈఆర్సీ), న్యూమెక్సికో, వాషింగ్టన్‌లలో ఉన్న సాండియా, లాస్‌ అలమోస్‌ నేషనల్‌ లాబొరేటరీస్‌, రిచ్‌లాండ్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌, సెక్యూరిటీ ట్రాన్స్‌పొర్టేషన్‌ ఆఫీస్‌ తదితర సంస్థలపై సైబర్‌ దాడి జరిగిందని పొలిటికో తెలిపింది.

అమెరికా అణ్వాయుధాలను దాచేది ఎన్‌ఎన్‌ఎస్‌ఏ సంస్థే. ఈ దాడి నేపథ్యంలో అమెరికాలోని ప్రభుత్వ, ప్రైవేటు నెట్‌వర్క్‌లు ప్రమాదంలో పడ్డాయని ఆ దేశ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. హ్యాకర్లు సైబర్‌ దాడులకోసం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

అమెరికాలో 70 శాతానికిపైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లకు వాడే పరికరాలను సోలార్‌ విండ్‌ అనే సంస్థ తయారుచేస్తున్నది. హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీతోపాటు, ఫెడరల్‌ ఆర్థిక, వాణిజ్య, హోంశాఖలకు కూడా ఈ సంస్థే పరికరాలు సరఫరా చేస్తున్నది. మైక్రోసాఫ్ట్‌ సహా దేశంలోని ఫార్చూన్‌ 500 జాబితాలో ఉన్న కంపెనీలన్నీ సోలార్‌ విండ్‌ సంస్థ కస్టమర్లే. దాంతో హ్యాకర్లు ముందుగా ఆ సంస్థను టార్గెట్‌ చేశారు.

ఈ సంస్థ సరఫరా చేసే పరికరాల్లో అత్యంత రహస్యంగా ప్రమాదకరమైన ఓ కోడ్‌ను చొప్పించారు. ఆ పరికరాలను నెట్‌వర్క్‌లలో వాడటం మొదలుపెట్టగానే కోడ్‌ సాయంతో హ్యాకర్లు సైబర్‌ దాడులకు పాల్పడ్డారని అమెరికా దర్యాప్తు అధికారులు గుర్తించారు. వాణిజ్య సంస్థల నెట్‌వర్క్‌ల నుంచి ఆ కోడ్‌ను తొలగించామని డీవోఈ ప్రతినిధి షేలిన్‌ హైన్స్‌ తెలిపారు.

అయితే, కీలకమైన అణు సంస్థల పరిస్థితిని మాత్రం వెల్లడించలేదు. ‘మా నెట్‌వర్క్‌లో కూడా ప్రమాదకర కోడ్‌ను గుర్తించి వెంటనే ధ్వంసం చేశాం’ అని మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి ఫ్రాంక్‌ షా తెలిపారు.

అమెరికాను వణికిస్తున్న ఇంతటి భారీ సైబర్‌ దాడికి పాల్పడింది రష్యా హ్యాకర్లేననే వాదన బలపడుతున్నది. రష్యా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ప్రైవేటు సైబర్‌ నేరగాళ్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని అమెరికా అధికారులు అనుమానాలు వ్యక్తంచేశారు. అమెరికాకు ప్రాణాధారమైన విద్యుత్‌ గ్రిడ్‌ను కుప్పకూల్చేందుకే ఈ దాడి జరిగి ఉంటుందని ఎఫ్‌బీఐ అధికారులు అంటున్నారు.

‘ఈ దాడి వెనుక ఉన్నది రష్యా హ్యాకర్లేనని మేము నమ్ముతున్నాం. కానీ నూటికి నూరుశాతం ధ్రువీకరించుకోకుండా ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేం. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన సైబర్‌ దాడి’ అని ఎఫ్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు.  సైబర్‌ దాడిపై దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు.  తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సైబర్‌ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తానని జో బైడెన్‌ ప్రకటించారు.