తిరిగి రాహుల్ కే అధ్యక్ష పదవికై సోనియా వ్యూహం 

నాయకత్వం పనితీరుపై అసంతృప్తితోపాటు సంస్థాగత మార్పులు తేవాలని ఆకాంక్షిస్తూ  గత ఆగష్టు లో పార్టీ అధినేత్ర సోనియా గాంధీకి నేరుగా 23 మంది సీనియర్ నాయకులు లేఖ వ్రాయడం ఒక విధంగా పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడమే. 
 
ఇప్పటి వరకు ఆ లేఖపై పార్టీ వేదికలపై ఎక్కడ కూడా ప్రస్తావించని సోనియా గాంధీ తాజాగా వారిలో కొందరిని పిలిచి సమాలోచనలు జరపాలని నిర్ణయించడం రాహుల్ గాంధీకి తిరిగి పార్టీ పగ్గాలు అప్పచెప్పే వ్యూహంలో భాగంగానే అని స్పష్టం అవుతున్నది.   
కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిపై త్వరలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఈ సందర్భంగా ప్రకటించడం గమనార్హం. కాంగ్రెస్ ఎలక్టోరల్ కాలేజ్‌లో ఉన్న ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, సభ్యులు అందరు కలిసి సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే రాహుల్ కు సన్నిహితుడిగా పేరొందిన సూర్జేవాలా 99.9 శాతం మంది నాయకులు రాహుల్ నాయకత్వాన్ని కోరుకొంటున్నరని కూడా ప్రకటించడం ఆసక్తి కలిగిస్తుంది. పార్టీపై తన పట్టు జారిపోకుండా రాహుల్ జాగ్రత్త పడుతున్నట్లు వెల్లడి అవుతుంది.
2019 సాధారణ ఎన్నికల అనంతరం పార్టీ ఘోర పరాజయానికి  బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన స్థానంలో తమ కుటుంభం నుండి కాకుండా మరెవరినైనా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి ఆయన పట్టుబట్టారు.
అయితే చివరకు అనారోగ్యంతో ఇంటినుండి బయటకు రాలేని పరిస్థితులలో ఉన్న సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించి, ఆమె సారథ్యంలోనే పార్టీని నడిపిస్తున్నారు. అయితే కీలక నిర్ణయాలను రాహుల్ తీసుకొంటూ వస్తున్నారు. పార్టీకి శాశ్వత అధ్యక్షులు లేకుండా తాత్కాలిక నీయమకాలతో గడుపు తుండడంతో పార్టీ అస్థిత్వాన్ని కోల్పోతున్నట్లు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ అధ్యక్ష పదవికి పార్టీలో పలువురు పేర్లు ముందుకు వచ్చినా వారెవ్వరికి అప్పచెప్పకుండా నెట్టుకొంటూ వస్తున్నారు. ఇప్పుడు తిరిగి వచ్చే ఏడాది మొదట్లో రాహుల్ కు నాయకత్వం అప్పచెప్పడం కోసం కసరత్తు ప్రారంభించినట్లు సుర్జీవాలా ప్రకటన వెల్లడి చేస్తున్నది.
తమ కుటుంభం నుండి కాకుండా మరొకరికి పార్టీ అధ్యక్ష పదవి అప్పజెప్పితే తమ కుటుంభం పట్టు పార్టీపై తొలగిపోతుందని రాహుల్, ప్రియాంక ఆందోళన పడుతున్నట్లు కనబడుతున్నది. పైగా తమ కుటుంభం పోషిస్తూ వస్తున్న నేతలంతా  తెరమరుగు కావలసి వస్తుందని కూడా భయపడుతున్నారు.
ఫిబ్రవరి లో ఏఐసీసీ సమావేశాన్ని జరిపి, అక్కడ అధ్యక్ష ఎన్నిక జరపాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతనే పలు రాష్ట్రాలలో పిసిసి లలో కూడా భారీ మార్పులకు రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో రాహుల్ నాయకత్వంలో ప్రచారం చేయాలనీ తలపడుతున్నారు.