తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం   

తెలంగాణలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా.. కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. భారత్ బంద్ కు మద్దతు తెలిపిన కేసీఆర్ దిల్లీలో రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అరుపులు.. ఢిల్లీలో కాళ్ళు పట్టుకోవడం కేసీఆర్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేసీఆర్‌ తుగ్లక్‌లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కల్పిస్తే తప్పేంటని  ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం దళారుల జేబులు నింపటానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చురకలు అంటించారు. భూసార పరీక్షల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ పక్కదారి పట్టించారని డా లక్ష్మణ్ ఆరోపించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో సురేష్ యాదవ్‌పై దాడిని ఖండించారు. కేసీఆర్ రైతుల భుజాలమీద తుపాకులు పెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేసీఆర్‌ తుగ్లక్‌లాగా వ్యవహరిస్తున్నారని అంటూ నిజాం పాలనలో-  గడీల్లో చీకటిమయమై, చిధ్రమైన తెలంగాణలానే నేటి తెలంగాణ కనపడుతోందని దుయ్యబట్టారు.
 ఉద్యోగ సంఘాలు కేసీఆర్‌ భజన సంఘాలుగా మారాయని విమర్శించారు. ఎదురుగాలి వీస్తోందనే ఉద్యోగాల భర్తీ అని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ డ్రామాలను ప్రజలు నమ్మరని  చెప్పారు.
•