మద్దతు ధరపై అనవసరపు వివాదం 

మద్దతు ధరపై అనవసరపు వివాదం 
దేశ రాజధాని సమీపంలో పక్షం రోజులకు పైగా రైతాంగం జరుపుతున్న ఆందోళనలో ప్రధానంగా రెండు సమస్యలను రైతులు కేంద్ర ప్రభుత్వం ముందు, దేశ ప్రజల ముందు ఉంచుతున్నారు.  మొదటి అంశం కనీస మద్దతు ధర విధానంకు నూతన వ్యవసాయ చట్టాల నేపథ్యంలో స్వస్తి పలికే అవకాశం ఉన్నదనే ఆందోళన. మరో అంశం కాంట్రాక్టు వ్యవసాయ విధానంలో ఒప్పందాలకు ప్రైవేట్ కంపెనీలు కట్టుబడి ఉందని పక్షంలో రైతులు ఏ విధంగా రక్షణ కలుగుతుంది? 
 
కనీస మద్దతు ధరకు సంబంధించి స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం మైన హామీలు ఇస్తున్నారు. రైతు నాయకులతో జరుపుతున్న చర్చలలో ఆ విషయాన్నీ స్పష్టంగా లిఖిత పూర్వకంగా హామీ ఇస్తామని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ భరోసా ఇస్తున్నారు. అయినా కూడా రైతులలో నమ్మకం కలగడం లేదు. 
 
వాస్తవానికి కనీస మద్దతు ధర అనే ఒక ఇంద్రజాలంలో అటు రైతులు, ఇటు ప్రభుత్వం కూడా కీలకమైన వ్యవసాయ సంస్కరణల అంశం నుండి దృష్టి పక్కకు సారిస్తున్నట్లు అనిపిస్తున్నది. 1991లో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమైనా వాటి ప్రయోజనం గ్రామీణ, వ్యవసాయ రంగానికి చేరడం లేదు. ఈ రంగాలలో ఎటువంటి పెట్టుబడులు రావడం లేదు. 
 
దానితో భారత దేశం ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చెందినా,  గ్రామీణ, ఆర్ధిక రంగాలు మాత్రం నీరసించి పోతున్నాయి. రైతుల ఆదాయం పడిపోతుంది. వ్యవసాయంపై ఆధారపడుతున్న వారి సంఖ్య తగ్గిపోతున్నది. 
 
నేడు వ్యవసాయం చేస్తున్న యువకులను వివాహం చేసుకోవడానికి గ్రామాలలోని యువతులు సహితం ఇష్టపడటం లేదు. గ్రామాల నుండి ప్రజలు రోజువారీ కూలీలుగా పట్టణాలకు తరలి వస్తున్నారు. దానితో పట్టణాలలో మురికి వాడలు పెరిగిపోయి అక్కడ జీవన సమస్యలు తలెత్తుతున్నాయి. 
 
వ్యవసాయం నుండి తప్పుకుంటున్న వారికి పట్టణాలలో వేరే చెప్పుకోదగిన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయా అంటే అవి కూడా లేవు. ఒక విధంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకు పోతున్నది. అయినా కూడా మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలు పడిన కరోనా సమయంలో నిలదొక్కుకొని, వృద్ధి చూపుతున్నది గ్రామీణ, వ్యవసాయ రంగాలు కావడం గమనార్హం. 
 
ప్రధాని మోదీ ఆశిస్తున్నట్లు భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలన్నా, మనం చాలాకాలంగా కోరుకొంటున్నట్లు సూపర్ పవర్ కావలి అన్నా వ్యవసాయరంగం లాభదాయకం కావాలి. దేశంలో ఇప్పటికి అత్యధిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది ఈ రంగమే కావడం గమనార్హం. 
 
ఇటువంటి కీలకమైన వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేయాలనే ధృడమైన సంకల్పాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేయడం ఒక విధంగా స్వాగతింపదగిన అంశం. అర్ధ శతాబ్ది కాలం తర్వాత మొదటి సారిగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాభివృద్ధి పట్ల దృష్టి సారిస్తున్నది. 
 
1960 దశకం మధ్యలో ఇందిరా గాంధీ హరిత విప్లవంతో దేశంలో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన అసాధారణ మార్పుల తర్వాత ఈ రంగంపై కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారించడం ఇదే కావడం గమనార్హం. 
 
మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు మనం ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొంటున్నాము. విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. వరి, గుధుమలు వంటివి శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువ కావడంతో రైతులు వాటిపై కన్నా వారణిజ్య పంటలవైపు ఆసక్తి చూపడం ప్రారంభించారు. 
 
అందుకనే రైతులను ఆహార ధాన్యాలలో దేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రోత్సహించడం కోసం కనీస మద్దతు ధరను  1966-67లో ప్రారంభించారు. మొదటగా గోధుమలు క్వింటాల్ కు రూ 54 ధర నిర్ణయిస్తూ ఈ ధర ప్రకటించారు. ఆ తర్వాత ఈ పంటల సంఖ్యను 23 పంటలకు విస్తరించారు. 
 
కేంద్ర ప్రభుత్వం జీఓల ద్వారా ఎప్పటికప్పుడు కనీస మద్దతు ధరను ప్రకటించడమే గాని అందుకు ఎటువంటి చట్టబద్ధ ప్రాతిపదిక లేక పోవడం గమనార్హం. అయితే కేవలం 6 శాతం మంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధర ప్రయోజనం నేడు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం నియమించిన శాంత కుమార్ నాయకత్వంలోని అత్యున్నత కమిటీ నిర్ధారించింది. 
 
దేశంలో ఐదారు వందల పంటలు పండుతూ ఉండగా కేవలం 23 పంటలకు మాత్రమే ఈ ధర ప్రకటిస్తున్నారు. వీటిల్లో కేవలం మూడు పంటలను మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు చేసే వ్యవస్థ ఉంది. అవి వరి, గోధుమలు, పత్తి. దాని వల్లన పంటలకు ప్రభుత్వ సంస్థలే ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. 
 
కానీ మిగిలిన పంటలకు ఎటువంటి వ్యవస్థలు లేవు. వాటి ధరలు పడిపోయినా ప్రభుత్వం చేయగలిగింది ఆచరణలో పెద్దగా ఉండదు. మనకు పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యం తీసుకు వస్తున్న పొగాకు, పసుపు, మిర్చి వంటి వాటికీ కనీస మద్దతు ధర లేదు. మిగిలిన పంటలను కూడా కనీస మద్దతు ధర వ్యవస్థలోకి తీసుకు రావాలని ఉద్యమాలు చేస్తున్న రైతు నాయకులు కూడా అడగక పోవడం గమనార్హం. 
 
పంటల ధరలు బాగా పడిపోయినప్పుడు పలు సందర్భాలలో మార్కఫెడ్ వంటి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మార్కెట్ లోకి ప్రవేశించి కొనుగోళ్లు చేపట్టినా అప్పటి వరకు ఆగలేక రైతులు దళారులకు అయినకాడికి అమ్ముకోవడం చూస్తున్నాము. పత్తిని కొనుగోలు చేయడానికి భారత కాటన్ కార్పొరేషన్ ఉన్నప్పటికీ మొదట్లో రైతు ఆత్మహత్యలు తెలుగు రాష్ట్రాలలో పత్తి రైతులలోనే ఎక్కువగా ఉండడం గమనార్హం. 
 
కేంద్ర ప్రభుత్వం వద్ద రెండున్నరేళ్ళకు సరిపడిన ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. నిల్వచేసే సామర్ధ్యం సరిగ్గా లేకపోవడంతో సుమారు 30 శాతం ధాన్యాలు నిల్వ చేసే సమయంలో పనికిరాకుండా పోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకోవడం నానాటికి అసాధ్యంగా మారుతున్నది. 
 
మరోవంక కాంట్రాక్టు వ్యవసాయం సహితం ఇప్పటికే సుమారు 25 శాతం వ్యవసాయ ఉత్పత్తులకు అమలులో ఉంటూ వస్తున్నది. ప్రైవేట్ వ్యాపారులను రైతులతో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండేటట్లు చేయడం అంత తేలికైన అంశం కాదు. 
 
ఎందుకంటె ఇప్పుడు రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు సివిల్ కోర్ట్ లలో లేదా ప్రత్యేక ట్రిబ్యునల్ లలో ఇటువంటి వివాదాలను తీసుకు వెళ్లినా సుదీర్ఘ న్యాయపోరాటాలకు సన్న, చిన్నకారు రైతులు తట్టుకోవడం సాధ్యం కాదు. సాధారణ రైతులు విశేషమైన వనరులు గల ప్రైవేట్ కంపెనీలతో న్యాయపోరాటం చేయడం అసమానుల మధ్య పోరాటం కాగలదు. 
 
వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేటట్లు చేయడమే ఈ సమస్యలకు పరిష్కారం కాగలదు. అందుకనే నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి నుండి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అత్యధిక పరిష్కారం లభిస్తున్నది. పైగా ప్రతి మండల కేంద్రంలో కూడా శీతల గిడ్డంగులు నెలకొల్పే విధంగా ప్రోత్సహించడం ద్వారా రైతులు కారుచవుకగా తన ఉత్పత్తులను అమ్ముకోనీయకుండా ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నది. 
 
నూతన వ్యవసాయ చట్టాలలో రైతులకు లభించిన పెద్ద అవకాశం ఎక్కడైనా తమ ఉత్పతులను అమ్ముకొనే స్వేచ్ఛ. ఇటువంటి స్వేచ్ఛ కోసం రైతులు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నారు. నేడు ఒక జిల్లా నుండి మరో జిల్లాకు తమ పొలంలో పండిన పంటలను కూడా తమ సొంత వినియోగం కోసం తీసుకు రాలేని విధంగా నిత్యావసర వస్తువుల చట్టం రైతులను కట్టడి చేస్తున్నది. అందుకనే రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర పొందలేక పోతున్నారు. 
 
 
వాస్తవానికి వ్యవసాయ మార్కెటింగ్ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. రైతులు ఎక్కువగా దళారీల చేతులలో నిలువు దోపిడీకి గురవుతున్నది ఇక్కడనే. ఈమార్కెట్ వ్యవస్థ ద్వారా రైతులకు గరిష్టంగా ధర లభించేటట్లు చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించక పోవడం తెలిసిందే. 
 
మార్కెట్ కమిటీలలో సంస్కరణల కోసం యుపిఎ ప్రభుత్వంలోనే మాదిరి మార్కెట్ కమిటీ చట్టం రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపితే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ చెప్పుకోదగిన శ్రద్ద చూపలేదు. నేడు రైతులు ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయవలసి ఉంది. 
 
మొత్తం మీద వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే పారిశ్రామిక వాతావరణం పెరిగితే సహజంగానే రైతులకు సహితం ఎక్కువ ధరలు లభిస్తాయి. అటువంటి వాతావరణం కోసమే మౌలికంగా వ్యవసాయ సంస్కరణల లక్ష్యం కావాలి. ఆ దిశలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలలో మార్పులు అవసరమైతే పరస్పరం సంప్రదింపుల ద్వారా సాధించుకునే అవకాశం ఉంది. 
 
కేంద్ర ప్రభుత్వం సహితం చట్టాలలో మార్పులకు సానుకూలత చూపుతున్నది. ఒక విధంగా వ్యవసాయ రంగ సమస్యలపై ఇటీవల కాలంలో, ముఖ్యంగా ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత మొదటి సారిగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది.
 
మన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ వికాసంకోసం ఇదొక్క బంగారు అవకాశంగా పరిగణించాలి. రాజకీయాలకు తావులేకుండా వ్యవసాయంను లాభసాటిగా మార్చుకునేందుకు ఉద్యమించాలి. వ్యవసాయంను ఒక పరిశ్రమగా భావించే పరిష్టితికి ఎదగాలి. తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకొనే విధంగా నేడు రైతులకు లభించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి.