బెంగాల్ పోలీసులపై మహిళా కమీషన్ ఆందోళన 

బెంగాల్ పోలీసులపై మహిళా కమీషన్ ఆందోళన 
తమకు వచ్చిన ఫిర్యాదులపై పశ్చిమ బెంగాల్ పోలీసులు ఎటువంటి  తీసుకోనక పోవడం పట్ల జాతీయ మహిళా కమీషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాము పంపిన ఫిర్యాదులపై పక్షం రోజులలోగా బెంగాల్ పోలీసులు ఎటువంటి చర్య తీసుకోనని పక్షంలో వాటిని తగు చర్య తీసుకోవడం కోసం కేంద్ర హోమ్ శాఖకు పంపిస్తామని కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ హెచ్చరించారు.
 
రాష్ట్ర ప్రభుత్వంపై తదుపరి ఏం చర్యలు తీసుకోవాలో హోంశాఖనే చూసుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి గత 8 నెలల కాలంలో ఎన్‌సిడబ్లుకు 267 ఫిర్యాదులు మేర వచ్చాయి. వీటిల్లో కొన్ని సుమోటో కేసులు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. 
 
ఆయా కేసుల విచారణ నిమిత్తం రేఖా శర్మ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఫిర్యాదులపై రాష్ట్ర పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. 
 
‘డిజిపి లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా నన్ను కలవలేదు. ఇలా చేయడం మొదటిసారేం కాదు. వారు ప్రతిసారి ఫిర్యాదులపై అవగాహన లేని సబార్డినేట్‌లనే పంపుతున్నారు’ అని రేఖా శర్మ విస్మయం వ్యక్తం చేశారు. 15 రోజుల్లోగా అధికారులు స్పందించకుంటే దీనిపై సిఎం మమతకు లేఖ రాస్తానని, అనంతరం ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు అప్పగిస్తానని ఆమె వెల్లడించాయిరు. 
 
ఉత్తర బెంగాల్‌, రాష్ట్రంలోని గిరిజిన ప్రాంతాల నుంచి మహిళల అక్రమ రవాణాపై కమిషన్‌ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఈ ఆరోపణలు, నిరాధారమైనవని, రాజకీయంగా ప్రేరేపించబడినవని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా పేర్కొన్నారు.