తెలుగు రాష్ట్రాల సాగునీటి ప్రాజెక్ట్ లపై కేంద్రం చెక్ 

తెలుగు రాష్ట్రాల సాగునీటి ప్రాజెక్ట్ లపై కేంద్రం చెక్ 
ఎన్ని సార్లు అడిగినా డిపిఆర్ లు సమర్పించకుండా సాగునీటి ప్రాజెక్ట్ లపై ముందుకు వెడుతున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హెచ్చరిక చేసింది. గోదావరిపై తెలంగాణ చేబడుతున్న ఏడు ప్రాజెక్ట్ లతో పాటు, ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్ట్ విషయంలో కూడా ముందుకు వెళ్లరాదని స్పష్టం చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ముఖ్యమంత్రిలకు లేఖలు వ్రాసారు.
కాళేశ్వరం మూడో టీఎంసీ తరలింపునకు సంబంధించిన పనులు సహా, గోదావరిపై తెలంగాణ చేపడుతున్న ఏడు ప్రాజెక్టులపై సవివర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌) లేకుండా ముందుకు వెళ్లరాదని పేర్కొంటూ ఆయన  సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ ఫిర్యాదు నేపథ్యంలో.. ఏపీలోరాయలసీమ లిప్టు, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వంటి ప్రాజెక్టు నిర్మాణాలను కూడా చేపట్టకూడదని ఆ లేఖలో పేర్కొన్నారు.
అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించిన అంశాల అమలుకు సంబంధించి షెకావత్‌ ఈ లేఖ రాశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ 11వ తేదీ సాయంత్రం కావత్‌ను కలిసి మాట్లాడిన  సమయంలోనే కేంద్ర మంత్రి ఈ లేఖ వ్రాయడం గమనార్హం. అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించిన అంశాలనే ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు.
ఇరురాష్ట్రాలూ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలను  ఆపాల్సిందిగా కోరారు. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించి, అవసరమైన అనుమతులను పొందాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన గోదావరి బేసిన్‌లోని కాళేశ్వరం మూడో టిఎంసీ ప్రాజెక్టుతో పాటు, సీతారామ, దేవాదుల-3, తుపాకులగూడెం, దిగువ పెన్‌గంగా, రామప్ప-పాకాల వంటి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ పనుల్ని చేయకూడదని స్పష్టం చేశారు.
 కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించడానికి సంబంధించిన పనులకు అనుమతులను ఇచ్చామని, మూడో టిఎంసీ పనులకు అనుమతులను తీసుకోలేదని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పనుల కోసం కేంద్రం నుంచి అవసరమైన హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, ఇన్వె్‌స్టమెంట్‌, పర్యావరణ అనుమతులు తీసుకోవాలని సూచించారు. అప్పటి వరకు ప్రాజెక్టు పనుల్ని చేపట్టవద్దని పేర్కొన్నారు.
నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి వీలుగా కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.  అయితే 2010లో బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు వెల్లడించిందని, దీనిపై అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని, 2014లో తెలంగాణ ప్రభుత్వం అందులో ఇంప్లీడ్‌ అయిందని, సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చిందని గుర్తుచేశారు.
‘‘సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున కొత్త ట్రైబ్యునల్‌ను (సెక్షన్‌-3 ప్రకారం) ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, ఈ కేసును ఉపసంహరించుకుంటానని అపెక్స్‌లో అంగీకరించారు కదా ’’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకున్న తర్వాతనే, కేంద్ర ప్రభుత్వం అందుకుతగ్గ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
 పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపు, రాయలసీమ లిప్టు ప్రాజె క్టుల పనుల్ని కూడా చేపట్టకూడదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కేడబ్ల్యూడీటీ-1లో, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న ప్రాజెక్టులు తప్ప.. మిగిలిన అన్ని ప్రాజెక్టులనూ కొత్త వాటిగానే పరిగణిస్తున్నట్టుగా ఇంతకు ముందే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లొద్దని కృష్ణా బోర్డు, కేంద్ర జలశక్తి శాఖ పలుమార్లు లేఖలు రాసిందని, తాను కూడా ఆగస్టు 7న లేఖ రాశానని గుర్తు చేశారు. అపోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై కేంద్రం వైఖరి స్పష్టంగా ఉందని.. ఏపీ ఈ ప్రాజెక్టును చేపట్టకూడదన్నదే తమ అభిప్రాయమని ఆయన చెప్పారు.
 శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీటిని తరలించడం, శ్రీశైలం ఎడమ జల విద్యుత్‌ కేంద్రం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా ఎక్కువ నీటిని సాగర్‌లోకి విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ గతంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని కోరింది.
దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌ను ఖరారు చేయాలని అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించామని, అది జరిగిన తర్వాత బోర్డే ఇలాంటి విషయాలను పరిశీలిస్తుందని చెప్పారు.
అలాగే 2016లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నీటి వాడకాన్ని లెక్కించడానికి వీలుగా టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా రెండు రాష్ట్రాలూ నిధులు సమకూర్చకపోవడంతో వాటి ఏర్పాటు పూర్తి కాలేదని ఆయన గుర్తు చేశారు. టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు అవసరమైన నిధులను అందుబాటులో ఉంచితే బోర్డు తగు నిర్ణయాలను తీసకుంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
 
గోదావరి కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు అంశాన్ని షెకావత్‌ ప్రస్తావిస్తూ అపెక్స్‌ కౌన్సిల్‌లో కొత్త ట్రైబ్యునల్‌ను వేయాల్సిందిగా 2 రాష్ట్రాలూ లేఖ ఇస్తే పరిశీలిస్తామని అప్పుడే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రాల నుంచి ఇలాంటి లేఖలు ఇంకా తమకు అందలేదని చెప్పారు.