రైతులకు నష్టం కలిగించే పనులు కలలో కూడా చేయం 

రైతుల మద్దతుతోనే కేంద్రంలో నరేంద్ర  మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినదని స్ఫష్టం చేస్తూ వారికి నష్టం కలిగించే పనులు కలలో కూడా తమ ప్రభుత్వం చేయబోదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, కమ్యూనిస్టులు అడ్డుకున్నా తాము అనుకున్నది చేసి తీరుతామని స్పష్టం చేశారు. 
 
ఆరేళ్లుగా తమ ప్రభుత్వం  అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా విద్యుత్ అందిస్తున్నామని పెక్రోన్నారు. రైతులకు సరిపడా ఎరువులు, యూరియా అందిస్తున్నని, ఎరువుల కొరత లేని దేశంగా మార్చామని తెలిపారు. 
 
రాజకీయంగా మోదీని ఎదుర్కోలేకనే వ్యవసాయ చట్టాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.  కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతూ టీఆర్ఎస్ చేసింది రైతుల బంద్ కాదు.. సర్కారీ బంద్ అంటూ ధ్వజమెత్తారు. 
 
భారత్ బంద్‌లో పాల్గొన్న కేటిఅర్, కవితలను ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేసే నిరసనలకు సైతం పోలీసులు సహకరించాలని కోరారు. భారత్ బంద్‌లో స్వయంగా మంత్రులు పాల్గొనటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.  ఈ ఏడాది రూ.లక్షా 14 వేల 578 కోట్ల రైతు రుణాలివ్వబోతున్నామని వెల్లడించారు. 
 
 కిసాన్ బ్రాండ్ పేరుతో రామగుండం పరిశ్రమ నుంచి తెలంగాణ, ఏపీ రైతులకు యూరియా అందించబోతన్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఒన్ నేషన్..‌ ఒన్ గ్రిడ్‌తో రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు.  
 
సీడ్ డెవలప్‌మెంట్ కోసం సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లో ఐటీసీ కంపెనీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని,మార్కెట్ యార్డులను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. వేర్ హౌసింగ్‌ల కోసం తెలంగాణకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. 
 
తెలంగాణలో పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవటం పట్ల విచారం వ్యక్తం చేశారు. రైతుల దగ్గరకు వెళ్ళి వ్యవసాయ చట్డంపై వాస్తవాలు చెప్పాలని నిర్ణయించామని పేర్కొంటూ రైతులకు అవగాహన కల్పించటం కోసం కిసాన్ టీవీ ఛానల్ తీసుకొచ్చామని గుర్తు చేశారు.