ప్రపంచ వ్యాప్తంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకొని, రాజకీయ, ఆర్ధిక, రక్షణ పర సమాచారాలను దొంగిలించి తమ దేశ ఆధిపత్యం కోసం విశేషంగా కృషి చేయడంలో పేరొందిన చైనాలో ఆధిపత్యం వహిస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ సమాచారం ఇప్పుడు లీక్ కావడం సంచలనం కలిగిస్తున్నది.
ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా పాశ్చాత్త దేశాలలోని కంపెనీలలో తమ పార్టీ సభ్యులను జొప్పించి, వారి ద్వారా కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు ఈ సమాచారం వెల్లడిస్తున్నది. ఈ విషయంపై ‘ది ఆస్ట్రేలియన్’, ‘ది మెయిల్’, ‘న్యూయార్క్ పోస్టు’ ‘స్కైన్యూస్’ వంటి అంతర్జాతీయ పత్రికలు సంచలన కథనాలు వెలువరించాయి.
ఈ పత్రికల కథనాల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో చైనా వాళ్లున్నారు. వీటిల్లో రక్షణ రంగానికి చెందినవి, బ్యాంకులు, ఫార్మాస్యూటికల్స్‌తోపాటు చివరికి కరోనా వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చైనా డేటాగా ప్రచారం అవుతున్న సమాచారం 2016లో సేకరించినట్లు తెలుస్తోంది.
చైనా ప్రభుత్వానికి చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ సర్వర్‌ల నుంచి ఈ డేటాను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ సర్వర్‌లు షాంఘైలో ఉన్నాయి. చైనా నుంచి పారిపోయిన కొందరు గూఢచారులు ఈ సమాచారాన్ని లీక్ చేశారు. అంతకంటే ముందే చైనాతో ప్రజాస్వామ్య దేశాల సంబంధాలను పరిశీలించే ‘ది ఇంటర్ పార్లమెంటరీ అలయెన్స్ ఆన్ చైనా’కు కూడా అందజేశారు.
అనంతరం ది ఆస్ట్రేలియన్, మెయిల్ ఆన్ సన్‌డే, ది స్టాండర్డ్, ఎడిటర్ పత్రికల కన్సార్టియమ్‌కు చేరవేశారు. ఈ డేటాలో మొత్తం 20 లక్షల మంది చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యుల వివరాలు ఉన్నాయి. పార్టీలో వారి స్థానం, నేషనల్ ఐడీ నంబర్, జాతి వంటి కచ్చితమైన వివరాలు ఉన్నాయి. దీంతో పాటు వివిధ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఏజెన్సీల్లో పనిచేస్తున్న 79,000 శాఖల వివరాలు కూడా బయటపడ్డాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు పలు దిగ్గజ సంస్థల్లో ఉన్నారు.
ఈ సంస్థల జాబితాలో ఉత్పాదక రంగానికి చెందిన బోయింగ్, ఫోక్స్‌వేగన్, రోల్స్‌రాయిస్ వంటి సంస్థలతో పాటు ఆర్థిక రంగానికి చెందిన ఏఎన్‌జెడ్, హెచ్‌ఎస్‌బీసీ వంటి సంస్థల్లోనూ ఉన్నారు. అంతేకాదు కరోనా వైరస్ టీకా ఉత్పత్తి చేస్తున్న ఫైజర్, ఆస్ట్రాజెనెకా వంటి సంస్థల్లో కూడా సీసీపీ సభ్యులున్నట్లు తెలుస్తోంది.
షాంఘైలోని ఆస్ట్రేలియా, యూకే, అమెరికా దౌత్య కార్యాలయాల్లో కూడా వీరు ఉన్నట్లు ఆయా కథనాల ద్వారా బయటపడ్డాయి. షాంఘై ఫారెన్ ఏజెన్సీ సర్వీసెస్ ద్వారా వీరు అక్కడ చేరినట్లు తెలుస్తోంది. ఇలా కంపెనీల్లో పనిచేస్తున్నవారు సీసీపీ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసినట్లు స్కైన్యూస్ పేర్కొంది. ఇవి నేరుగా సీసీపీకి అనుసంధానమై ఉంటాయి.
అయితే ఇలాంటి బ్రాంచ్‌లకు సంబంధించి స్పందించేందుకు చాలా కంపెనీలు నిరాకరించాయి. అయితే ఏఎన్‌జెడ్ సంస్థ మాత్రం ‘కంపెనీ నిబంధనలకు అనుకూలంగా పనిచేసినంత కాలం తాము ఉద్యోగుల రాజకీయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోమని వెల్లడించడం గమనార్హం.
సాధారణంగా వీరందరూ గూఢచారులని చెప్పడానికి వీలు లేదు. కానీ, ఇతర దేశాలకు సంబంధించిన విలువైన సమాచారం కనుక సీసీపీ సభ్యులుకుంటే అది ఎప్పటికైనా ప్రమాదకరమేనని, ఆ సమాచారం కచ్చితంగా చైనాకు చేరుతుందని ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే విశ్వసిస్తున్నాయి. ఆయా దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నాయి.
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా కమాండోలు అఫ్గానిస్థాన్‌లో అరాచకం చేశారంటూ చైనా విదేశాంగశాఖ ప్రతినిధి కొన్ని ఫొటోలను విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే ఆస్ట్రేలియ పత్రికలో ఈ లీక్ కథనం చోటు చేసుకోవడం గమనార్హం.
More Stories
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా
90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్