కరోనా పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నవన్నీ కాకిలెక్కలేనని పేర్కొం టూ ‘హిందూ’ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉండటంపై దాదాపు నెలరోజులపాటు జరిపిన పరిశోధనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినట్టుగా చెబుతున్న కరోనా పరీక్షలకు సంబంధించి అన్నీ తప్పుడు పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు ఉన్నట్టుగా వెల్లడైందని ఆ కథనంలో తెలిపింది.
సెప్టెంబరు-డిసెంబరు నెలల మధ్య ర్యాండమ్‌గా 352 పాజిటివ్ కేసులను తీసుకుని పరిశీలించగా.. అందులో 110 కేసుల్లో అనుమానాస్పద సమాచారం ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందని పేర్కొంది.
‘‘రోజుకు 60 పరీక్షలు చేయాలని మాకు లక్ష్యం పెట్టారు. కానీ, మా దగ్గరకు అంతమంది రావట్లేదు. దీంతో మేం ఆశా వర్కర్ల సాయం తీసుకున్నాం’’ అని పేరు వెల్లడించడానికి ఇష్టడని ఒక ల్యాబ్ టెక్నీషియన్ చెప్పి న విషయాన్ని ఆ కథనంలో ఉదహరించింది.
సదరు ల్యాబ్ టెక్నీషియన్ రోజుకు 60 పరీక్షలు చేసినట్టుగా చూపించుకోవడానికి అవసరమైన వ్యక్తుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇచ్చే బాధ్యత ఆశా వర్కర్లదన్నమాట.
నిజానికి. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులకు సంబంధించి తెలంగాణ ఆరోగ్య విభాగం రూపొందించిన టెస్టింగ్ ప్రొటోకాల్ మంచిదే. దాని ప్రకారం.. వైరస్ సోకిందన్న అనుమానం ఉన్నవారు టెస్టు చేయించుకోవడానికి వచ్చినప్పుడు తమ పేరు, చిరునా మా, ఫోన్ నంబరు ఇవ్వాలి.
ఆ ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ వ్యక్తికి 15 అంకెల యునిక్ ఐడెంటిటీ నంబరు కేటాయిస్తారు. ఈ డేటా అంతా సర్వర్‌లోకి అప్‌లోడ్ అవుతుంది. కానీ.. పీహెచ్‌సీల్లో రోజుకు 60 పరీక్షలు, ఏరియా ఆస్పత్రుల్లో 200 పరీక్షలు చేయాలంటూ ప్రభుత్వం లక్ష్యాలు పెట్టడంతో మొదటికే మోసం వచ్చింది.
రోజుకు అంతమంది పరీక్షల కోసం రాకపోవడంతో ఆశా వర్కర్లను అడిగి ఏవో ఫోన్ నంబర్లతో ఆరోజుకు నిర్దేశిత సంఖ్యలో పరీక్షలు చేసినట్టు చూపించి ‘మమ’ అనిపిస్తున్నారు!
టెస్టులు చేయించుకున్నవారి డేటాను పరిశీలిస్తే.. ఒకే ఫోన్ నంబరు, చిరునామాతో పలువురు టెస్టుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వంటివి కనిపించడం ఇందుకు నిదర్శనం. దీనిపై ప్రజారోగ్య సంచాలకుడిని సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరని హిందూ పత్రిక తన కథనంలో పేర్కొంది.
More Stories
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి
ఒకవైపు ప్రజాపాలన దినోత్సవాలు.. మరోవైపు విముక్తి దినోత్సవాలు
రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డుకు రూ 30 లక్షల ధర