తిరుపతి నుండి బిజెపి పోటీ … వీర్రాజు స్పష్టం 

తిరుపతి లోక్ సభ స్థానానికి త్వరలో జరిగే ఉపఎన్నికలలో బిజెపి పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. మిత్రపక్షాలైన బిజెపి, జనసేనలలో ఎవ్వరైనా పోటీ చేయవచ్చనే కధనాల మధ్య ఆయన తిరుపతిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో ఈ విషయమై ఒక సంకేతం ఇచ్చారు. 

ఈ సందర్భంగా తిరుపతిలో బిజెపి జరిపిన శోభాయాత్ర అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ జనసేన బలపరిచే బీజేపీ అభ్యర్థికి ఓటేయాలంటూ ఆయన పిలుపు ఇవ్వడం గమనార్హం. కాగా, వైసీపీ ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ పెరిగిపోయిందని సోము వీర్రాజు విమర్శించారు. 

ఇక తిరుమల శ్రీవారికి ఇచ్చిన విరాళాలను జగన్ తమ ఖాతాలో వేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రివర్స్ టెండరింగ్‌లో జగన్ అవినీతికి పాల్పడ్డారని సంచలన ధ్వజమెత్తారు. తిరుపతి ఉపఎన్నికల్లో కుటుంబ పార్టీల పాలనకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు. ‘ఏ సీటూ లేకుండానే తిరుపతిని బీజేపీ (కేంద్ర ప్రభుత్వం) ఎంతో అభివృద్ధి చేసింది. ఉప ఎన్నికలో ఎంపీ సీటిస్తే నగరాన్ని స్వర్ణమయం చేస్తాం’ అని భరోసా ఇచ్చారు. 

జగన్‌కు 22 ఎంపీ సీట్లున్నా ఇన్నేళ్లలో వారు చేసిన అభివృద్దేమీలేదని ధ్వజమెత్తారు. తిరుపతి స్మార్టు సిటీకి సిటీకి రూ.రెండువేల కోట్లను ప్రధాని నరేంద్ర మోదీ కేటాయించారని పేర్కొన్నారు. పలు మార్గాలను నాలుగులేన్లుగా అభివృద్ధి చేస్తున్నారని, అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారని, అనేక కేంద్ర విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేశారని వివరించారు. 
 
అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ, వైసీపీలకు సవాల్‌ చేస్తూ దమ్ముంటే చర్చకు ఒకే వేదికపైకి రావాలని కోరారు. ఎన్నికలకు ముందు జగన్‌ ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పుడు రాష్ట్రంలో ఏంజరుగుతుందో మీరే చూడాలని దుయ్యబట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్నారని, దీనికి అనువుగా అటవీశాఖలో అధికారుల స్థానాలను ఖాళీగా ఉంచేశారని ఆరోపించారు. 

ఎవరికీ తెలియని పేర్లతో ఉన్న మద్యాన్ని విక్రయిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. రూ.ఐదు వేలకోట్ల శ్రీవారి నగదును రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవాలన్న ప్రయత్నాన్ని బీజేపీ అడ్డుకుందని గుర్తుచేశారు. 

వైసీపీ ప్రభుత్వం ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడుతూ దీనిని బీజేపీ వ్యతిరేకిస్తుందని, గుణపాఠం చెబుతుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఓట్లేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. జగన్‌కు, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, మీకు నక్క కావాలా… నాగలోకం కావాలా అని ప్రశ్నించారు. 

ఇటీవల తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ రావు అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో త్వరలో తిరుపతి ఉపఎన్నిక జరగనుంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ, వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తిని పార్టీలు ప్రకటించాయి. ఇక బీజేపీ-జనసేనలు తమ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.