వరద సహాయంగా ప్రధానిని రూ 1,350 కోట్లు కోరిన కేసీఆర్ 

తెలంగాణలో  ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, వరద సాయంగా తాము అడిగిన రూ.1,350 కోట్లను అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కోరారు. మూడురోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో దాదాపు 45 నిముషాలసేపు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన నష్టం, ఇంకా ఇతర అపరిష్కృత సమస్యలతోపాటు పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో గత శతాబ్ద కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు కురిశాయని, అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారని సీఎం కేసీఆర్‌ వివరించారు.
ఈ నేపథ్యంలో వరదసాయంగా రూ.1,350 కోట్లు విడుదలచేయాలని కోరుతూ లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేసినట్టు తెలిసింది. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన వాటాపై చర్చించారు. జీఎస్టీ బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ఈ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలని సీఎం కేసీఆర్‌ కోరారు.
రాష్ట్రంలో తాము అమలుచేస్తున్న మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలకు రూ.24 వేల కోట్లు కేంద్రం ఇవ్వాలని నీతిఆయోగ్‌ సిఫారసు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరిన సీఎం, పాలమూరు  రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సహకారమందించాలని కూడా ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
మరోవైపు తన  పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను కలిసి నివేదించిన అంశాలపై నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు తక్షణమే కేంద్ర పౌరవిమానయాన శాఖ అనుమతులు ఇవ్వాలని, వాటితోపాటు సిద్దిపేట విమానాశ్రయంపై నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రధానమంత్రిని కోరారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం కేసీఆర్‌ ఆదివారం కలుసుకోనున్నారు. కాగా,  ఇటీవలి కాలంలో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన అమెజాన్‌, గూగుల్‌, యాపిల్‌ వంటి కంపెనీలు తమ ద్వితీయ మజిలీగా హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవటంపై ప్రధాని మోదీ  సీఎం కేసీఆర్‌ను ప్రశంసించినట్టు తెలిసింది. టీఎస్‌-బీపాస్‌ కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది.
మరోవైపు రాష్ట్రంలో కరోనా కట్టడికి అనుసరించాల్సిన విధానంపై ఇరువురు చర్చించారు.  సెంట్రల్‌ విస్టా దేశానికే గర్వకారణంగా నిలిచే సౌధం అవుతుందని ఇటీవల ప్రశంసించిన సీఎం కేసీఆర్‌, అదే విషయాన్ని ప్రధానితో నేరుగా చెప్పారు.
ఇక ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ నిర్మించనున్న పార్టీ కార్యాలయం భవనంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. న్యూఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో తెలంగాణ భవన్‌ నిర్మాణానికి 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రం కేటాయించినట్టు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు చెప్పారు.