చైనా నుండి భారత్ కు శాంసంగ్‌  కీలక యూనిట్ 

దక్షిణ కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ చైనాలోని తన కీలక మొబైల్‌, ఐటీ డిస్‌ప్లే ప్రొడక్షన్‌ యూనిట్‌ను భారత్‌కు తరలించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో స్మార్ట్‌ఫోన్ల తయారీ పరిశ్రమను నెలకొల్పిన శాంసంగ్  ఈ యూనిట్‌ను కూడా నోయిడాలోనే ఏర్పాటు చేయనున్నది.

ఇందుకోసం రూ.4,825 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా 510 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.  నోయిడాలో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు నిమిత్తం శాంసంగ్‌ డిస్‌ప్లే నోయిడా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేయాలని యూపీ సర్కార్‌ నిర్ణయించింది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన జరిగిన యూపీ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. భారత్‌లో శాంసంగ్‌కు చెందిన తొలి హై-టెక్నిక్‌ ప్రాజెక్టు ఇదేనని, ఈ ప్రాజెక్టుతో ఇలాంటి అధునాతన యూనిట్‌ ఉన్న మూడో దేశంగా భారత్‌ ఆవిర్భవిస్తుందని యూపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.

‘ఈ యూనిట్‌ ఏర్పాటు కోసం శాంసంగ్‌ రూ.4,825 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నది. ఉత్తరప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పాలసీ 2017 ప్రకారం భూమి బదలాయింపులో శాంసంగ్‌కు డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఐదేండ్లలో రూ.250 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్పెక్స్‌’ పథకం (స్కీమ్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్స్‌ అండ్‌ సెమీకండక్టర్స్‌) కింద శాంసంగ్‌కు రూ.460 కోట్ల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతాయని యూపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి వివరించారు.

నోయిడాలో శాంసంగ్‌ ఇప్పటికే మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పిన విషయం విదితమే. 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ యూనిట్‌ను ప్రారంభించారు. కరోనా వైరస్‌ను సృష్టించి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసినందుకు ‘డ్రాగన్‌’కు గట్టిగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్న పలు దేశాల కంపెనీలు చైనా నుంచి తమ పరిశ్రమలను భారత్‌ లాంటి ఇతర దేశాలకు తరలిస్తుండటం తెలిసిందే.