1.63 లక్షల జీఎస్‌టీ రిజిస్ట్రేషన్లు రద్దు

బూటకపు కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. మోసపూరితంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందడం కోసం సృష్టించిన కంపెనీలు, వ్యాపార సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంది. 1,63,000కు పైగా వ్యాపార సంస్థల వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, బూటకపు కంపెనీలు, సర్క్యులర్ ట్రేడింగ్ సంస్థల జాఢ్యాన్ని వదిలించుకునేందుకు జీఎస్‌టీ అధికారులు 1,63,042 సంస్థల జీఎస్‌టీ రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. అక్టోబరు, నవంబరు నెలల్లో ఈ చర్యలు తీసుకున్నారు. 

ఆరు నెలలకుపైగా ఈ సంస్థలు జీఎస్‌టీఆర్-3బీ రిటర్న్‌లను దాఖలు చేయకపోవడంతో వీటి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. ఈ సంస్థలకు ముందుగా నోటీసులు జారీ చేసి, నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. 

రిజిస్టర్డ్ సంస్థలు ప్రతి నెల తమ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన సమ్మరీ స్టేట్‌మెంట్‌ను అధికారులకు సమర్పించవలసి ఉంటుంది. దీనినే జీఎస్‌టీఆర్-3బీ రిటర్న్‌ అంటారు. ఐటీసీని మోసపూరితంగా పొందడం కోసం బోగస్ ఇన్‌వాయిస్‌లను జారీ చేయడం కోసం ఈ సంస్థలను సృష్టిస్తున్నారు. 

అధికారులు గత నెల నుంచి ఇటువంటి కంపెనీలపై చర్యలు ప్రారంభించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ), సెంట్రల్ జీఎస్‌టీ కమిషనరేట్లు ఒక నెలలోనే 132 మందిని అరెస్టు చేశాయి. 

వీరిలో నలుగురు చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఉన్నారు. 1,430 కేసులను నమోదు చేశారు. సంస్థల రిజిస్ట్రేషన్ సమయంలో దరఖాస్తుదారులు సరైన వివరాలను అందజేస్తున్నారా? లేదా? అనే విషయంపై కూడా అధికారులు దృష్టి సారించారు.