‘‘మావోయిస్టు’’, ‘‘నక్సలైట్ల’’ గుప్పెట్లో రైతుల ఉద్యమం  

‘‘మావోయిస్టులు’’, ‘‘నక్సలైట్’’ శక్తుల గుప్పెట్లో నుంచి రైతుల ఉద్యమం విడుదల పొందితేనే.. వ్యవసాయ చట్టాలకున్న పరమార్థం వారికి అర్థమవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రైతులతో సంప్రదింపులు జరుపుతున్న ఇద్దరు మంత్రులలో ఒక్కరైన ఆయన \ చర్చల ద్వారా పరిష్కారం లభించడం ఇష్టం లేని శక్తులు రైతుల ఉద్యమాన్ని హైజాక్ చేశాయని  ఆరోపించారు. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను మరోసారి సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపేందుకు సదా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం చర్చల ద్వారానే విబేధాలు సమసిపోతాయని హితవు చెప్పారు.

‘‘24 గంటల్లో ఎప్పుడైనా రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. మావోయిస్టులు, నక్సలైట్ల నుంచి రైతుల ఉద్యమానికి విముక్తి కలిగితేనే రైతులకు వ్యవసాయ చట్టాలు, దేశ ప్రయోజనాలు అర్థమవుతాయి” అని త్లెఇపారు. అయినప్పటికీ వారికి ఏమైనా సందేహాలు ఉంటే.. వాటిని నివృత్తి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

వ్యవసాయ చట్టాలకు దాదాపు దేశంలోని రైతులంతా మద్దతు తెలుపుతున్నారని ఆయన తెలిపారు. ‘‘దాదాపు రైతులంతా వ్యవసాయ చట్టాలకు మద్దతుగా ఉన్నారని నమ్ముతున్నాను. రైతుల్లో ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని చర్చల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు” ని సూచించారు.  

చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా పరిష్కారం లభించకపోవడం చూస్తే  ఈ ఉద్యమం వారి చేయిదాటిపోయినట్టు అనిపిస్తోందని ధ్వజమెత్తారు. మరోవంక, రైతులు డిమాండ్ చేస్తున్నట్లు ఈ చట్టాలను వెనుకకు తీసుకొనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని గోయల్ స్పష్టం చేశారు.