ఆందోళనకరంగా మారిన లాలూ ఆరోగ్యం 

ఆందోళనకరంగా మారిన లాలూ ఆరోగ్యం 

ఆర్జేడీ అధినేత  లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఉమేష్ ప్రసాద్ తెలిపారు. లాలూ మూత్రపిండాలు 25 శాతం మాత్రమే పనిచేస్తున్నందున ఏ సమయంలోనైనా పరిస్థితి క్షీణించే అవకాశాలున్నాయని చెప్పారు.

లాలూ పరిస్థితిని ఆయన చికిత్స పొందుతున్న రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) అధికారులకు డాక్టర్ ప్రసాద్ లిఖిత పూర్వకంగా తెలియజేశారు.  ‘గతంలో కూడా నేను ఇదే విషయం చెప్పాను. లాలూ కిడ్నీ 25 శాతం మాత్రమే పనిచేస్తోందనేది నిజం. కిడ్నీ పనితీరు భవిష్యత్తులో మరింత దిగజారిపోవచ్చు. అయితే ఎప్పుడనేది మాత్రం ఇతమిత్ధంగా చెప్పడం కష్టం’ అని డాక్టర్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. 

గత 20 ఏళ్లుగా ఆయన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నందున కిడ్నీ దెబ్బతింటూ వచ్చింది. పేషెంట్ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. ఏ నిమిషంలోనైనా పరిస్థితి దిగజారే అవకాశం ఉందని రిమ్స్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశాను’ అని డాక్టర్ ప్రసాద్ చెప్పారు. 

అయితే మధుమేహం కారణంగా కిడ్నీ దెబ్బతిన్నందున ఇతర వైద్య సౌకర్యాల కోసం ఆయనను వేరేచోటికి తరలించాల్సిన అవసరం లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని, వ్యాధిని ఏ మందూ నయం చేయలేదని డాక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. బయట చికిత్స చేయించినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. 

రిసెడెంట్ నెఫ్రాలజిస్టును సంప్రదించి భవిష్యత్‌ చికిత్సపై ఒక నిర్ణయానికి రావాలని తాము భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, పశుగ్రాసం కుంభకోణంలో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను లాలూ తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు జార్ఖాండ్ హైకోర్టు 2021 జనవరి 22వ తేదీకి శుక్రవారంనాడు వాయిదా వేసేంది.