రైతుల ఆందోళనలో ‘టుక్‌డే టుక్‌డే గ్యాంగ్’

వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనను ‘టుక్‌డే టుక్‌డే గ్యాంగ్’ నిర్వహిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ధ్వజమెత్తారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారలు తమ వద్ద ఉన్నాయని, వారే ఈ ఆందోళన నిర్వహిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. 

ప్రభుత్వం  రైతులు పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం కూడా వారేనని ఆరోపించారు. షార్జిల్ ఇమామ్, ఉమర్ ఖలీద్, గౌతమ్ నవ్లఖా లాంటి వ్యక్తులకు ఆందోళనలో ఉన్న వ్యక్తులు మద్దతు ఇవ్వడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

కాగా, ‘‘చర్చలు జరిగే సమయంలో షార్జిల్ ఇమామ్‌ను విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతు సమస్యల గురించి వేరే విషయాలపై చర్చించడం ఏంటి? దేశాన్ని విచ్చిన్నం చేయాలనుకుంటున్న వారి చేతుల్లోకి రైతుల ఆందోళన వెళ్తోంది’’ అంటూ మరో కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ విచారం వ్యక్తం చేశారు.

‘‘కనీస మద్దతు ధర, మండిలకు సంబంధించిన విషయాలు రైతులు ప్రస్తావించాలి. కానీ దానికి బదులు వేరే విషయాలు చర్చలోకి తీసుకువస్తున్నారు. రైతులకు ఇది చాలా ప్రమాదం. రైతు సమస్యల నుంచి పూర్తిగా పక్కదారి పట్టించే విషయాలు ఇవి’’ అని నరేంద్ర సింగ్ తోమర్ ఇంతకు ముందు పేర్కొన్నారు.