ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో పేలవమైన పనితీరు ప్రదర్శించిన కాంగ్రెస్‌లో పరస్పరం నిందారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లపై మాజీ రాష్ట్రపతి, దివంగత కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ విమర్శలు గుప్పించారు.
ప్రణబ్ తన పుస్తకం ‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ చివరి భాగంలో 2014లో కాంగ్రెస్ ఓటమికి వీరిద్దరే కారణమంటూ విమర్శిస్తూ రాసినట్లు తెలుస్తోంది. 2004లో తాను ప్రధాని అయ్యి ఉంటే 2014లో పార్టీ అధికారాన్ని కోల్పోయేది కాదని తోటి కాంగ్రెస్ నేతలు అంటుండేవారని కూడా అందులో పేర్కొన్నారు.
అయితే వారి వ్యాఖ్యలను తాను పెద్దగా పట్టించుకోనప్పటికీ, తాను రాష్ట్రపతి అయ్యాక కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కోల్పోవడం మాత్రం వాస్తవమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో సోనియా గాంధీ పార్టీ పగ్గాలను సరిగ్గా నిర్వహించలేకపోయారని, మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సభలకు సరిగ్గా హాజరుకాకపోవడం వల్ల మిగిలిన ఎంపిలతో వ్యక్తిగత సంబంధాలకు ముగింపు పలికినట్టైందని రాశారు.
జనవరిలో విడుదల కానున్న ఈ పుస్తకంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు కుప్పకూలిందో విశ్లేషించారు. అదేవిధంగా రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రధానులుగా ఉన్న మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీల పనితీరును పోల్చినట్లు సమాచారం. దేశం యొక్క మొత్తం స్థితి ప్రధాని, ఆయన పనితీరును బట్టి ప్రతిబింబిస్తుంటుందని పేర్కొన్నారు.
కాగా, మన్మోహన్ సింగ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో మునిగి తేలారని, ఇదే వారి పాలనను దెబ్బతీసిందని ఆ పుస్తకంలో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీసుకున్న వివిధ నిర్ణయాలు, 2016లో నోట్ల రద్దుపై కూడా ఆయన చర్చించారు.
More Stories
ఈషా ఫౌండేషన్‌పై పోలీసుల చర్యలకు `సుప్రీం’ బ్రేక్
హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మీడియాపై 50 శాతం పెరిగిన దాడులు!