రైతుల ఆందోళనను వామపక్ష తీవ్రవాదుల హైజాక్!

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న ఆందోళనను వామపక్ష అతివాదులు, వామపక్ష సానుభూతిపరులు హైజాక్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ కేంద్రానికి ఇంటెలిజెన్స్ వర్గాలు ఓ రిపోర్టును సమర్పించాయి. రాబోయే రోజుల్లో వామపక్ష తీవ్రవాదులు రైతుల ఉద్యమంలోకి చొరబడి ప్రభుత్వ, ప్రజా ఆస్తులను విధ్వంచేసే అవకాశాలున్నాయని, అందుకు తగ్గ పూర్తి ఆధారాలను తాము సేకరించామని అధికారులు పేర్కొన్నారు. 

ఢిల్లీ-జైపూర్ రహదారులను దిగ్బంధం చేసే ఆలోచన రైతులకిచ్చింది కూడా వామపక్ష అతివాదులేనని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి వెల్లడించాయి.  కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆందోళనకారులకు ఓ ప్రముఖమైన హెచ్చరిక చేసింది.

‘‘మీ ఉద్యమాన్ని వేదికగా చేసుకొని విదేశీ శక్తులు విజృంభించే అవకాశం ఉంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మీ ఆందోళనను వేదికగా చేసుకొనే అవకాశాలున్నాయి. జాగ్రత్త.’’ అని రైతు సంఘాల నేతలకు కేంద్రం సూచించింది. టిక్రీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతుల ఉద్యమంలో షర్జిల్ ఇమామ్ పోస్టర్లు వెలిసిన నేపథ్యంలో కేంద్రం ఈ హెచ్చరికను చేసింది.

‘‘రైతుల ముసుగులో రైతు ఉద్యమ వాతావరణాన్ని పాడుచేయడానికి కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని కేంద్రం రైతులను హెచ్చరించింది.  కాగా, ఈ నివేదికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సీనియర్ పోలీసు అధికారులతో కీలక భేటీ నిర్వహించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షా అధికారులతో చర్చించారు. 

రైతుల ఆందోళనను పొడగించడం, హింసకు పాల్పడే ఉద్దేశంతో రైతు సమూహంలోకి కొన్ని శక్తులు ప్రవేశించి, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నట్లు ప్రభుత్వానికి కొన్ని నివేదికలు అందాయి. దాదాపు పది గ్రూపులు రైతుల ఉద్యమంలోకి చొరబడి అల్లర్లు సృష్టించడానికి సిద్ధం అయిన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు అందించాయి.