రైతు  ఉద్యమంలో వామపక్ష అతివాదులు 

 వామపక్ష అతివాదులు కూడా రైతు ఉద్యమంలోకి వచ్చారని, రైతులు చేస్తోన్న ఉద్యమం తప్పుడు దిశలో వెళ్తోందని  కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హెచ్చరించారు.  దీనిపైనే కేంద్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తోందని చెప్పారు. 

మొదట 31 సంఘాలకు చెందిన నేతలు చర్చలకు వచ్చారని, ఆ తర్వాత 35 సంఘాలుగా మారాయని, చివరికి 37 సంఘాల నేతలు చర్చల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. అయితే అసలు సమస్య ఏదంటే ఆ సంఘాల్లో వామపక్ష అతివాదులు కూడా ఉన్నారని, ఆ విషయం చాలా రోజుల తర్వాత తెలిసిందని ఆయన వెల్లడించారు.  

రైతుల ఆందోళనలతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ విషయాన్ని రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పేవారు కావాలని కేంద్ర మంత్రి  కోరారు.  రైతులకు మద్దతు ధర అలాగే ఉంటుందని, అందులో సందేహపడాల్సిన అవసరమే లేదని  తోమర్ మరోసారి మరోసారి భరోసా ఇచ్చారు.

కనీస మద్దతు ధర ఇకముందూ కొనసాగుతుందని, రైతులతో చర్చలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.  కనీస మద్దతు ధరను చట్టంగా తెస్తే వచ్చే ఇబ్బందులేమి? అని ప్రశ్నించగా  ప్రతిదాన్ని చట్టంగా చేయడం కుదరదని, కొన్ని విషయాల కోసమే చట్టం చేస్తామని తేల్చి చెప్పారు.

కొన్ని విషయాలు చట్టాలతో కాకుండా నియమాల ప్రకారం నడుస్తున్నాయని, కొన్ని పరిపాలనా ఆదేశాల ద్వారా నిర్వహించబడతాయని ఆయన వివరించారు. కనీస మద్దతు ధర అనేది ప్రభుత్వ పరిపాలనా నిర్ణయమని, దాని ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారని, ప్రతి దానికీ చట్టాలు అవసరం లేదని స్పష్టం చేశారు.

కనీస మద్దతు ధర చట్టం చేయడం ద్వారా కేంద్రంపై ఆర్థిక భారం పడుతుందన్న భయం ఏమైనా ఉందా? అని అడగ్గా ఒక నిర్ణయం వెనుక చాలా పరిణామాలను చూడాల్సి ఉంటుంది, ప్రభుత్వం అన్ని కోణాలనూ స్పృశిస్తూ తుది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధరను అందించే ప్రయత్నంలో కేంద్రం ఉందని ఆయన తెలిపారు.

గతంలో కంటే ఈసారి ఖరీఫ్ కొనుగోలు చాలా పెరిగిందని, రబీకి కావాల్సిన మద్దతు ధరను కూడా ప్రకటించామని, ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర విషయంలో కేంద్రాన్ని అనుమానించడం ఏమాత్రం సమంజసం కాదని తోమర్ తేల్చి చెప్పారు. 

వ్యవసాయ రంగంలో మార్పులు అత్యావశ్యకమని, ఉపాధి అవకాశాలు కూడా సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశంలో రైతే అతిపెద్ద ఉత్పత్తిదారుడు అని, స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా రైతుల పరిస్థితిలో కచ్చితంగా మార్పులు కనిపిస్తాయని తోమర్  భరోసా ఇచ్చారు. 

రైతు భూమిని పారిశ్రామిక వేత్తలు ఆక్రమించే ఛాన్స్ ఉండదని, డిజిటల్ మాధ్యమం ద్వారా ఎక్కడెక్కడ ఎంతెంత ధర ఉందో గమనించి, రైతులు అక్కడ తమ పంటలను అమ్ముకునే అవకాశాలు కూడా కొత్త చట్టం ద్వారా పుష్కలంగా లభిస్తాయని తోమర్ వివరించారు.