అడ్డంకులను బద్దలు కొట్టి రైతులను సంపన్నులుగా చేస్తాం 

అడ్డంకులను బద్దలు కొట్టి రైతులను సంపన్నులుగా చేస్తాం 
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మధ్య ఉన్న అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడతాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీని ద్వారా రైతులకు నూతన వ్యవసాయ మార్కెట్ల సృష్టి జరిగి, సాంకేతికంగా రైతులు పురోగతి సాధించే వీలుందని భరోసా ఇచ్చారు.
 
‘‘వ్యవసాయం దాని అనుబంధ రంగాలైన వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఆహార శుద్ధి, నిల్వలు, శీతల గిడ్డంగులు తదితర రంగాల మధ్య కొన్ని గోడలున్నాయి. నూతన చట్టాలతో ఈ గోడలన్నీ బద్దలైపోతున్నాయి. దీని ద్వారా రైతులకు కొత్త కొత్త మార్కెట్లు ఉద్భవిస్తాయి” అంటూ అంటూ ధీమా వ్యక్తం చేశారు. 
 
సాంకేతిక ప్రయోజనాలు ఒనగూరుతాయి. సాంకేతిక ప్రయోజనాలు నెరవేరుతాయి. వీటి ద్వారా కొత్త పెట్టుబడులకు మార్గాలు తెరుచుకుంటాయి. వీటి ద్వారా రైతులు ప్రయోజనం పొందుతారని తెలిపారు.  ఒక రంగం పురోభివృద్ధి సాధించినపుడు ఆ ప్రభావం ఇతర రంగాలపై కచ్చితంగా పడుతుందని ఆయన పేర్కొన్నారు.
పరిశ్రమల మధ్య అనవసరపు గోడలు నిర్మించినపుడు ఏమి జరుగుతుందో ఊహించుకోవచ్చని, వాటి ద్వారా జరగాల్సినంత అభివృద్ధి ఆ పరిశ్రమలో జరగదని హెచ్చరించారు. ‘ఫిక్కీ’ 93 వ వార్షిక సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ ప్రసంగం చేస్తూ దేశంలోని రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లలో గానీ, బయట గానీ అమ్ముకునే స్వేచ్ఛ వారికి ఉందని స్పష్టం చేశారు.
అంతేకాకుండా డిజిటల్ వేదికల ద్వారా కూడా వారి ఉత్పత్తులను అమ్ముకునే వీలుందని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి, వారిని సుసంపన్నులుగా చేస్తాయని ఆయన పునరుద్ఘాటించారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రపంచ దేశాలు భారత దేశంపై ఎనలేని విశ్వాసాన్ని చూపించాయని, ఆ విశ్వాసం కొన్ని నెలల్లోనే మరింత రెట్టింపైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అది విదేశీ పెట్టుబడుల విషయంలో కానీ, లేదా ఎఫ్‌పీఐ లో గానీ విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లో విశేషంగా పెట్టుబడులు పెట్టారని, ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారని  ప్రధాని చెప్పారు. భారత పరిశ్రమలకు గోడలు అవసరం లేదని, ఒక రంగంతో మరో రంగాన్ని కలిపే ‘వారధులు’ అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి ప్రభావం ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ప్రారంభమైందని, ఆ సమయంలో తెలియని శత్రువుతో పోరాడామని గుర్తు చేశారు. ఆ సమయంలో చాలా అస్థిరత పోగైందని, దాంతో పాటు చాలా సమస్యలు కూడా చుట్టుముట్టాయని పేర్కొన్నారు. అవి ఎంత కాలం కొనసాగుతాయో అన్న స్పష్టత కూడా అప్పట్లో రాలేదని, కానీ డిసెంబర్ మాసం వచ్చే సరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని మోదీ తెలిపారు. 

మనకు ఓ మార్గం దొరికిందని, రోడ్ మ్యాప్ కూడా సిద్ధమైపోయిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆర్థిక సూచీలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. 2020 సంవత్సరం అందర్నీ కలవర పెట్టిందని, అదే సమయంలో చాలా విషయాలు అత్యంత వేగంగా మారిపోయిన విషయాన్ని కూడా గుర్తించాలని ప్రధాని కోరారు. 

కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ చాలా హెచ్చు తగ్గులను చూశాయని, అయినా దేశం బాగా అభివృద్ధి చెందుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కాలం ముగిసిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే.. మనమే నమ్మలేనంత అభివృద్ధి జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.