రైతుల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ రచ్చబండలు

రైతుల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ రచ్చబండలు

నూతన వ్యవసాయ చట్టాలపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు బీజేపీ భారీ కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా విలేకర్ల సమావేశాలు, రచ్చబండలను నిర్వహించబోతోంది. ఈ చట్టాలపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి మద్దతు కూడగట్టేందుకు ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ చట్టాలకు సవరణలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ, ఆ ప్రతిపాదనలను తిరస్కరించడంతోపాటు ఆంధోళన కార్యక్రమాలను తీవ్రతరం చేయాలని రైతులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

నూతన చట్టాల వల్ల వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరకు భరోసా ఉండదని, కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి జిల్లాలోనూ రైతులకు ఈ చట్టాలపై అవగాహన కల్పించాలని బీజేపీ నిర్ణయించింది. 

దేశవ్యాప్తంగా దాదాపు 700 విలేకర్ల సమావేశాలు, సుమారు 700 రచ్చబండలు నిర్వహించి, ఈ చట్టాలపై రైతుల్లో ఏర్పడిన సందేహాలను నివృత్తి చేయాలని నిర్ణయించింది. 

ఇలా ఉండగా, రైతులు ఉద్యమ పంథాను వీడాలని, ప్రభుత్వంతో చర్చలు జరపాలని కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్  మరోమారు విజ్ఞప్తి చేశారు. చర్చల విషయంలో ఏర్పడ్డ  ప్రతిష్టంభనను రైతులు తొలగించాలని ఆయన కోరారు. రైతుల ఉద్యమంతో సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు వెంటనే తమ ఉద్యమాన్ని విరమించుకొని, చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. 

టిక్రీ సరిహద్దుల వద్ద రైతుల ఆందోళనలో షర్జీల్ ఇమామ్ ఫొటో కనిపించడంపై తోమర్ స్పందిస్తూ.. ‘‘ఈ ఉద్యమం కనీస మద్దతుధర, మండీలు, రైతులకు చెందిన ఉద్యమం. మరి షర్జీల్ ఇమామ్ పోస్టర్ రైతు సమస్య ఎలా అవుతుంది. ఇది అత్యంత ప్రమాదమైంది. దృష్టి మరల్చడానికి మాత్రమే ఇలా చేస్తున్నారు.’’ అని తోమర్ మండిపడ్డారు. 

 రైతుల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలను పంపిందని, రైతులు వాటిపై చర్చిస్తే బాగుంటుందని హితవు చెప్పారు. రైతుల విషయంలో కేంద్రం ఆలోచిస్తూనే ఉందని, కొన్ని అంశాలపై కూడా ఆలోచిస్తున్నామని తెలిపారు.

కనీస మద్దతు ధరను మరింత పటిష్ఠం చేసే విషయంలో ఏమి చేస్తే బాగుంటుందని తాము రైతుల అభిప్రాయాలను కోరామని, కానీ రైతులు మాత్రం తగిన జవాబివ్వలేదని తెలిపారు. తాము రెండు ప్రతిపాదనలు పంపామని, రైతు మండీల వెలుపల ఉండే ప్రైవేట్ మండీల నమోదు విషయంలో రైతుల  భయాలను తొలగించామని తోమర్ స్పష్టం చేశారు.

ప్రైవేట్ మండీల నమోదు, పన్నుపై నిర్ణయం తీసుకునే హక్కు ఆయా రాష్ట్రాలకు ఉందని తోమర్ స్పష్టం చేశారు. చట్టాలను వెనక్కి తీసుకుంటారా? అని ప్రశ్నించగా, అన్ని కోణాల్లోనూ ఆలోచించే ఈ చట్టాలను రూపొందించామని, రైతుల జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే చట్టాలను రూపొందించామని స్పష్టం చేశారు. 

కేంద్రమే అధికమన్న భావన తమకు ఏ కోశానా లేదని, రైతు సంఘాలు కూడా వారి మనస్సుల్లో ఏదో ఉంచుకోవద్దని కోరారు. రైతులతో చర్చలు జరిపిన తర్వాత చట్టాల్లో సవరణలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తోమర్ ప్రకటించారు.