కేంద్రంపై విషం చిమ్మేందుకే కేసీఆర్ ఢిల్లీ పర్యటన

అబద్ధాలతో కేంద్రంపై మరోసారి విషం కక్కడమే కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక ఉద్దేశమని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా ప్రచారం చేయడంలో కేసీఆర్ దిట్ట అని పేర్కొంటూ తెలంగాణ ప్రజలెవ్వరూ కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.

వేములవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ఫాంహౌస్ లో పండించిన దొడ్డువడ్లను కార్పొరేట్ సంస్థలకు నచ్చిన ధరకు అమ్ముకున్నాడని దుయ్యబట్టారు. కానీ, కేసీఆర్ మాటలు నమ్మి రైతులు సన్నవడ్లు పండిస్తే మద్దతు ధర లేక, కొనుగోళ్లు లేక నష్టపోవాలా అని ప్రశ్నించారు. 

రైతుల సంక్షేమం కోసమే నరేంద్ర మోదీ సర్కారు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాల పట్ల రైతుల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని పేర్కొంటూ టీఆర్ఎస్ నిర్వహించిన బంద్ కార్యక్రమం అట్టర్ ప్లాఫ్ అని ధ్వజమెత్తారు. అందులో రైతులెవ్వరూ లేరని వెల్లడించారు.

వ్యవసాయ చట్టాలతో రైతులకు కలిగే నష్టం ఏమిటో ఇప్పటికైనా కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారని అంటూ రైతు పండించుకున్న పంటకు రైతే ధర నిర్ణయించుకోవడం తప్పా? అంటూ నిలదీశారు.

రైతు పంటకు ముందే ముందస్తు ఒప్పందం ప్రకారం తనకు నచ్చిన ధరకు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛను కల్పించడాన్ని వ్యతిరేకిస్తారా? అని అడిగారు. రైతులంతా బిజెపికి అనుకూలంగానే ఉన్నారని, కానీ రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ మాటలు నమ్మి రైతులు 30 లక్షల ఎకరాల్లో సన్నవడ్లు పండించారని,  తీరా చాలాప్రాంతాల్లో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో, మద్దతు ధర ప్రకటించకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నరని తెలిపారు. సన్నవడ్ల కొనుగోలు విషయంలో క్వింటాలుకు రూ. 2500 చొప్పున మద్దతు ధర ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు.

కేంద్రం భూసార పరీక్షల కోసం తెలంగాణకు రూ. 125 కోట్లు కేటాయిస్తే కేసీఆర్ ఫాంహౌస్ లో మాత్రమే భూసార పరీక్షలు చేయించుకొని దొడ్డువడ్లు పండించారని ఎద్దేవా చేశారు.

ఐఆర్, పీఆర్సీ అమలు చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మద్దతుగా డిసెంబరు 14న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు. ఉద్యోగుల ఐఆర్, పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేవరకు పోరాడుతామని సంజయ్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం మిడ్ మానేరు ముంపు గ్రామాల బాధితుల పరిహారం చెల్లించి, వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే జనవరి మొదటి వారంలో మిడ్ మానేరు నుంచి ముంపు బాధితులతో కలిసి గవర్నర్ కార్యాలయానికి పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తగిన ప్రతిపాదనలు పంపాలని కోరారు .