అంతుబట్టని వ్యాధితో కలకలం సృష్టించిన ఏలూరు ఘటనకు పురుగు మందుల అవశేషాలే కారణమని, దీంతోపాటు బియ్యంలో పాదరసం, ఆర్గానో క్లోరిన్స్, ఆర్గానో ఫాస్పేట్స్, రక్తంలో లెడ్, నికెల్ వంటి భారలోహాలు కారణమని నిపుణులు ప్రాథమికంగా నిర్థారించారు.
ఇవి బాధితుల శరీరాల్లోకి ఎలా చేరాయన్న అంశాన్ని ఒకటి రెండు రోజుల్లో తేల్చనున్నారు. ఏలూరు ఘటనపై కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధనా సంస్థల నిపుణులతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తమ పరిశీలన ఫలితాలను వివరించారు.
పశువులు, చేపల నుండి కూడా శాంపిళ్లను సేకరించి భోపాల్ పంపించినట్లు నిపుణులు తెలిపారు. అనంతరం సిఎం మాట్లాడుతూ ఆహార పదార్థాల్లో పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని, రైతులకు సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆర్‌బికెల ద్వారా అనుమతించిన పురుగుమందులనే వినియోగించాలని సూచించారు. వచ్చే నెలరోజులపాటు పురుగుమందుల తనిఖీ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు.ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థ నిర్వహించిన పరీక్షల్లోనూ పురుగుమందులే ఎక్కువ మోతాదులో ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు.
అన్నంలో పాదరసం(మెర్య్కురీ) ఛాయలు కనిపించినట్లు ఎన్‌ఐఎన్ వెల్లడించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కమీషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలు కనిపించా యని సీసీఎంబీ స్పష్టమైన నివేదిక ఇచ్చిందని చెప్పారు. అయితే నీటి విషయంలో అపోహ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
వాయు కాలుష్యం ఏమీ లేదని ఎయిమ్స్, ఎన్‌ఐ సీటీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తేల్చి చెప్పాయని పేర్కొన్నారు. ఎయిమ్స్ రెండోసారి ఇచ్చిన నివేదికల్లోనూ బాధితుల్లో సీసం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించిందని చెప్పారు.
మరోవంక, అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య శుక్రవారం గణనీయంగా తగ్గింది.ఐదుగురు మాత్రమే ఈ తరహా లక్షణాలతో వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మొత్తం 611 మంది ఈ వ్యాధి బారిన పడగా, వీరిలో 569 మంది డిశ్చార్జి కాగా, 34 మంది విజ యవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు.
ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఏడుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల కిందటే ఓ వ్యక్తి మరణించారు. మగవారే ఈ వ్యాధి బారిన ఎక్కువ పడినట్టుగా గుర్తించారు.
More Stories
కోల్కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!
రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్తో ప్లాన్… ఐఎస్ కుట్ర!
బుడమేరుకు మళ్లీ వరద ముప్పు