
“మేడమ్ దయచేసి నిప్పుతో ఆటలాడొద్దు” అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్ చిన్నపాటి హెచ్చరిక తీవ్రస్వరంతో చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై కేంద్ర బలగాలు కాపలాగా ఉన్న సమయంలో దాడి ఎలా జరుగుతుందని అంటూ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించడంపై ఆయన సీరియస్ అయ్యారు.
‘జేపీ నడ్డా కాన్వాయ్ పై గురువారం జరిగిన దాడి దురదృష్టకరం. ఆ ఘటనతో నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డా. నాకు సిగ్గుచేటుగా అనిపించింది. పాలనలో ఇదో బాధాకరమైన రోజు. ఈ విషయంపై సీఎం మమతా బెనర్జీ చేసిన వాఖ్యలు సరికాదు” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి మమత కచ్చితంగా రాజ్యాంగాన్ని అనుసరించాలని, రాజ్యాంగ పంథా నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె పక్కకు వెళ్లరాదని సూచించారు. చాలా రోజులుగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో దిగజారిన ప్రజాస్వామ్య విలువలపై తాను కేంద్రానికి ఓ నివేదిక పంపినట్లు ఆయన వెల్లడించారు.
దేశ చట్టాలను, రాజ్యాంగాన్ని, గొప్ప బెంగాల్ సంస్కృతిపై విశ్వాసం ఉంచే బాధ్యతాయుత సీఎం ఇలా మాట్లాడతారా? అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు. “నేను ఆమెకు ఓ విషయం చెప్పదలచుకున్న .. మేడం, దయచేసి గౌరవంగా వ్యవహరించి మీరు చేసిన వాఖ్యాలను వెనక్కి తీసుకోండి” అంటూ హితవు చెప్పారు.
బీజేపీ నేతలు బయటివారంటూ మమతా బెనర్జీ విమర్శించడంపై ధన్కర్ మండిపడ్డారు. ‘‘బయటి వ్యక్తులంటే అర్థమేమి? రాష్ట్రంలో ఉన్న వారు ఎవరు బయట వ్యక్తులు. భారతీయ ప్రజలు కూడా బయటి వారేనా?” అంటూ ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటనలు చేయడం ఏమాత్రం తగదని మందలించారు. భారత్ ఒక దేశం, భారతీయులందరూ ఒక్కటే. దయచేసి చిచ్చు పెట్టకండి. రాజ్యాంగం కిందే మీరూ పని చేస్తున్నారు. దాన్ని గౌరవించండి అంటూ హెచ్చరించారు.
ఇలా ఉండగా, పశ్చిమబెంగాల్‌లో శాంతిభద్రతల పరిస్థితికి సంబంధించి ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు (డీజీపీ), చీఫ్ సెక్రెటరీకి (సీఎస్) కేంద్ర హోంశాఖ సమన్లు జారీచేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.
More Stories
ఉస్మానియాలో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు
వియత్నాంపై రాహుల్ కు అంత ప్రేమ ఎందుకో?
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం బ్రేక్ – రీ సర్వేకు ఆదేశం