ఆసియాలో ప్రధాన సైనిక, ఆర్థిక ముప్పుగా మారిన చైనా

ప్రధాన సైనిక, ఆర్థిక ముప్పుగా మారిందని అమెరికా సెక్రటరీ ఆఫ్ కామర్స్ విల్‌బర్ రాస్ హెచ్చరించారు. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను చైనా పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ ఆసియా సమ్మిట్‌లో విల్‌బర్ రాస్ మాట్లాడుతూ, అమెరికన్ సప్లయర్స్‌కు కంపెనీల యాక్సెస్‌ను దేశ భద్రత కారణాలపై కట్టడి చేసే అమెరికన్ ఎంటిటీ లిస్ట్‌లో చైనా కంపెనీలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా 539 యాంటీ డంపింగ్, కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ ఆర్డర్స్  విధించిందని, వీటిలో చైనా కంపెనీలపై విధించినవి 210 అని ఆయన తెలిపారు. 

చైనాతో 14 ఆసియా-పసిఫిక్ దేశాలు ఇటీవల కుదుర్చుకున్న రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్టనర్‌షిప్‌ గురించి రాస్ మాట్లాడుతూ, వాణిజ్యంలో ఎదురవుతున్న అత్యంత సున్నితమైన సమస్యలను ఈ ఒప్పందం పరిష్కరించదని  స్పష్టం చేశారు. 

ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలకు రాయితీలు ఇవ్వడం, మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ, మార్కెట్‌ను సమానంగా అందుబాటులోకి తేవడం వంటి సమస్యలను పరిష్కరించదని చెప్పారు. అన్ని చోట్ల స్వేఛ్చ, న్యాయంతో కూడిన వ్యాపారాన్ని ప్రోత్సహించడం కొనసాగించవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 

అదే సమయంలో దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాలను కూడా కాపాడుకోవాలని సూచించారు. అమెరికా వాస్తవంగా అతి తక్కువ రక్షణవాదంతో నడిచే ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని తెలిపారు. 

అనుచితంగా అతి తక్కువ ధరకు ఉత్పత్తులను అమ్మినపుడు యాంటీ డంపింగ్, కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీలను విధిస్తారు. యూఎస్ ఎంటిటీ లిస్ట్‌లో చేర్చిన చైనా కంపెనీల్లో టెలికాం దిగ్గజం హువావెయి కూడా ఉంది.