మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్న పాక్, చైనా  

పాకిస్థాన్‌, చైనా, మయన్మార్‌, ఎరిట్రియా, ఇరాన్‌, నైజీరియా, నార్త్‌ కొరియా, సౌదీ అరేబియా, తజికిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌ దేశాలు మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు వీటితో కూడిన ఒక జాబితాను అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తాజాగా విడుదల చేశారు.

 ‘‘ఇప్పటి వరకూ ఈ జాబితాలో ఉన్న సూడన్‌, ఉజ్బెకిస్థాన్‌ దేశాలను ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన జాబితా (ఎ్‌సడబ్ల్యూఎల్‌) నుంచి తొలగించాం. ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మత స్వేచ్ఛ విషయంలో అద్భుతమైన ప్రగతిని సాధించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచాయి” అని తెలిపారు. 

కాగా,  కొమొరొస్‌, క్యూబా, నికరాగువా, రష్యాలను ఎస్‌డబ్ల్యూఎల్‌లో చేరుస్తున్నామని చెప్పారు. ఆల్‌-షబాబ్‌, ఆల్‌ఖైదా, బోకో హరాం, హయత్‌ తహ్రీర్‌ అల్‌-షామ్‌, హౌతీ, ఐసిస్‌, ఐసి్‌స-గ్రేటర్‌ సహారా, ఐసి్‌స-పశ్చిమాఫ్రికా, జమాత్‌ నసర్‌ అల్‌-ఇస్లాం వల్‌ ముస్లిమిన్‌, తాలిబన్‌ ఉగ్రసంస్థలను ఆందోళనకర సంస్థలుగా గుర్తిస్తున్నామని పాంపియో వెల్లడించారు. 

అమెరికా నిర్ణయం పట్ల యూఎస్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రిలిజియస్‌ ఫ్రీడమ్‌ హర్షం వ్యక్తం చేసింది.