“నీ ఇంటికొస్త.. నీ కాళ్లు.. చేతులు నరుకుత” నంటూ పటాన్ చెరువు వార్త దినపత్రిక విలేకరి సంతోష్ నాయక్ ను అసభ్యకర పదజాలంతో దూషించిన టిఆర్ఎస్ ఎమ్యెల్యే మహిపాల్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. కబ్జాలపై వార్త రాసినందుకు ఎమ్మెల్యే దూషించిన వైనం సంచలనం రేపింది.
దిక్కు ఉన్న చోట చెప్పుకో అంటూ ఆ ఎమ్యెల్యే బూతులు తిట్టారు. ఆ ఆడియో వైరల్ అయ్యింది. సంతోష్ పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించాయి.
బాధితుడితో కలసి నిన్న అమీన్ పూర్ పోలీస్టేషన్లో టీయూడబ్ల్యూజే, ఐజేయు విలేకరుల సంఘం ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు ఎమ్మెల్యేపై ఎస్సి, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేశారు.
దాంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఖంగు తిని, వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని పేరొక్నటు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. “జర్నలిస్టులంటే తనకు గౌరవం ఉందని, కబ్జాలతో తనకు సంబంధం లేదని” తెలిపారు. అయితే తన పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన వివరణ కూడా తీసుకోకుండా వార్తలు ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు.
కాగా, విలేకరి సంతోష్ నాయక్ ను బెదిరించడంతో పాటు, అసభ్యకర పదజాలంతో దూషించిన పటాన్ చెరువు ఎమ్యెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కేసు నమోదైనంత మాత్రనా తాము శాంతించేది లేదని, జర్నలిస్టులకు, మీడియాకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీలు డిమాండ్ చేశారు.
జర్నలిస్టులను దూషించడం, బెదిరింపులకు గురిచేయడం ఇది కొత్త కాదని, పదేండ్ల క్రితం ఆయన ఎంపీపీ అధ్యక్షుడిగా కొనసాగిన రోజుల్లో కూడా అక్కడి జర్నలిస్టుల పట్ల ఇదే వైఖరిని అనుసరిస్తే అప్పటి ఏపీయూడబ్ల్యూజే సంఘం అతనికి సరైన రీతిలో బుద్ధి చెప్పిందని శేఖర్, విరాహత్ అలీలు గుర్తుచేశారు. అతను ఎమ్యెల్యే అయ్యాక కూడా తన ప్రవర్తన మార్చుకోలేదని, ఇది మూడో సంఘటన అని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
More Stories
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు
హైదరాబాద్ నుండి నేరుగా గోవాకు రైలు ప్రారంభం