తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. ఆయన కుమారుడు భద్రారెడ్డితో పాటు మరో ఐదుగురు అనుచరులపైనా దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి సూరారంలో 20 గుంటల భూమిని కబ్జా చేసి ప్రహరీ నిర్మించారనేది అభియోగం.
మంత్రి మల్లారెడ్డికి చెందిన ఆస్పత్రుల మధ్య ఉన్న భూమిని కొంత బలవంతంగా ఆక్రమించుకోవడమేగాక, మిగిలిన భూమిని కూడా అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారని, లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పొన్నబోయిన శ్యామలాదేవి ఫిర్యాదు చేశారు. తనకు మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరారు.
ఈ ఫిర్యాదుపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ప్రకారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారంలోశ్యామలాదేవి తల్లి పద్మావతి పేరున 2.13 ఎకరాల భూమి ఉంది. అది మంత్రి మల్లారెడ్డికి చెందిన రెండు ఆస్పత్రుల మధ్యలో ఉంది. ఆ భూమిని తనకు విక్రయించాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. వినకపోవడంతో బెదిరింపులకు దిగారు. అంతేకాదు 20 గుంటలలో భూమిని కబ్జాచేసి ప్రహరీగోడను నిర్మించారు.
చాలా కాలంగా కొనసాగుతున్న ఈ వివాదంలో మల్లారెడ్డి అనుచరులు అనేకసార్లు శ్యామలాదేవిని, సోదరిని, తల్లి పద్మావతిని బెదిరించారు. దీంతో బాధితులు లక్ష్మీనారాయణ అనే న్యాయవాదిని సంప్రదించగా.. న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని చెప్పారు.
విషయం తెలుసుకున్న మంత్రి. న్యాయవాదిని మచ్చిక చేసుకున్నారు. స్టాంప్ పేపర్ల మీద వారి సంతకాలు తీసుకురావాలని సూచించారు. ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకని చెప్పి స్టాంప్ పేపర్లపై శ్యామలాదేవి, ఆమె తల్లి పద్మావతి, సోదరి సంతకాలు తీసుకుని.. వాటిని మంత్రి మల్లారెడ్డికి ఇచ్చారు.
వాటిపైనే భూమి విక్రయం జరిగినట్లుగా మార్చేశారు. మంత్రి అనుచరుడు గూడూరు మస్తాన్‌కు భూవిక్రయం జరిగినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వాటిని చూపించి ఆ భూమి తమదేనని మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డితోపాటు అనుచరులు శ్యామలాదేవి ఇంటికి తరచూ వెళ్లి బెదిరింపులకు దిగారు.
అనంతర కాలంలో శ్యామలాదేవి తల్లి, సోదరి మరణించారు. మిగతా భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయకుంటే చంపేస్తామని మంత్రి, ఆయన అనుచరులు శ్యామలాదేవిని భయభ్రాంతులకు గురిచేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
పోలీస్ అధికారులు తన ఫిర్యాదును పట్టించుకోకపోవడం లేదంటూ శ్యామలాదేవి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పందించిన కోర్టు.. బాధ్యులపై కేసులు నమోదు చేయాలని దుండిగల్ పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మంత్రి, ఆయన అనుచరులపై ఈ నెల 6న కేసు నమోదు చేశారు.
అయితే దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుతో తనకెలాంటి సంబంధం లేదని మంత్రి మల్లారెడ్డి చెబుతున్నారు. భూమిని కబ్జా చేశాననడంలో వాస్తవం లేదని, ప్రస్తుతం సూరారంలో ఎవరి భూమి వారికే ఉందని స్పష్టం చేస్తున్నారు. ఏడాది క్రితం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు వచ్చిందని, వారు విచారణ చేయకుండా జాప్యం చేశారని చెప్పారు. హైకోర్టు జోక్యంతో తాజాగా కేసు నమోదు చేశారని, తాను ఎవరి భూమినీ ఆక్రమించలేదని తెలిపారు.
More Stories
కలెక్టర్ పై దాడి చేసిన గ్రామంలో 55 మంది అరెస్ట్
న్యాయవాదిపై జిహాదీ మూకల హత్యాయత్నం!
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్యెల్యేకు నోటీసులు