తెలంగాణాలో ప్రతిపక్షాల భారత్ బంద్ విఫలం 

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం ప్రతిపక్షాలు నిర్వహించిన భారత్ బంద్ విఫలమైందని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణలో సర్కారే బంద్ నిర్వహించిందని ధ్వజమెత్తారు. బంద్​లో పాల్గొన్న టీఆర్ఎస్ నేతలను రైతులు ఎక్కడికక్కడ నిలదీశారని చెప్పారు.
 
 కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలను తరిమి కొట్టారని, మరికొన్ని చోట్ల ఆ పార్టీ వారే ఒకరికొకరు తన్నుకున్నారని ఎద్దేవా చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కేసీఆర్ దీన్ని తట్టుకోలేక జనాన్ని ఆ చర్చ నుంచి మళ్లించడం కోసమే  బంద్ కు మద్దతు ఇచ్చారని విమర్శించారు. 
 
భారత్ బంద్ లో పాల్గొన్న టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను ముందస్తుగా హౌజ్ అరెస్టు ఎందుకు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. వారికి సహకరించినట్లుగానే ఇక నుంచి తాము చేసే నిరసనలు, ఆందోళనలకు పోలీసులు సహకరించాలని కోరారు. 
 
 టీఎన్జీవో, జర్నలిస్టుల సంఘాల నాయకుల తీరుపై సంజయ్ నిప్పులు చెరిగారు. బంద్ లో  పాల్గొనే ఉద్యోగులకు డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ సర్కార్ ను కోరుతూ లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘాల నేతలు సీఎం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగతున్నారని విమర్శించారు. 
 
అసలు వీరికి సీఎం అపాయింట్ మెంట్ ఇస్తున్నారా, ఉద్యోగుల సమస్యలపై సీఎంతో ఒక్కసారైనా చర్చించారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఈ నాయకులు ఎందుకు చర్చించరని ప్రశ్నించారు. ఐఆర్, పీఆర్సీ గురించి ఎందుకు మాట్లాడరని ధ్వజమెత్తారు. 
 
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా బంద్ లో పాల్గొనడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని సంజయ్ చెప్పారు. బీజేపీ కూడా ఉద్యోగుల సమస్యలపై ఆందోళన చేయబోతుందని, టీఎన్జీవో నేతలు మద్దతిస్తారో లేదో చూడాలని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నేతల అక్రమాస్తుల లెక్కలు తీస్తామని హెచ్చరించారు. వీరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. 
 
వాళ్లను సస్పెండ్ చేయాలని లీగల్ గానే పోరాటం చేస్తామని చెప్పారు. టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులను ఓటింగ్ ద్వారా మాత్రమే ఎన్నుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్థానిక విలేఖరి ఒకరిని ఫోన్ లో బెదిరిస్తే జర్నలిస్టుల సంఘాల నేతలు ఎందుకు స్పందించరని నిలదీశారురు.
 
టీఆర్​ఎస్​ సర్కారు వైఫల్యాల​పై మరింత  గట్టిగా పోరాటం చేస్తామని సంజయ్ వెల్లడించారు. హైదరాబాద్​లో వచ్చినట్లే వరంగల్​లో వరదలు వచ్చి ఎంతో మంది నష్టపోయారని గుర్తు చేశారు. జీహెచ్​ఎంసీలో, గ్రేటర్​ వరంగల్​లో వరద బాధితులందరికీ రూ.10వేల సాయం అందేవరకు ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు.