ప్రశ్నించిన వ్యక్తిపై చేయిచేసుకున్న ఎమ్యెల్యే  

రోడ్ పై ధర్నా చేస్తుండగా ప్రశ్నించిన ఒక సామాన్య వ్యక్తిపై  ఎమ్యెల్యే అరికెపూడి గాంధీ చేయి చేసుకోవడంతో బంద్ సందర్భంగా ఉద్రిక్తత చెలరేగింది. పైగా, ఎమ్మెల్యే వెంట ఉన్న కార్యకర్తలు ప్రశ్నించిన వ్యక్తిని అక్కడి నుంచి తోసివేశారు. 

దీంతో ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు జనం. బంద్ వల్ల ఆఫీసులకు వెళ్లాలనుకునేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అసలైన రైతులు శాంతియుతంగా బంద్ లో పాల్గొంటుండగా,  పార్టీల నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని జనం ధ్వజమెత్తారు. 

ఉష ముళ్లపూడి కామన్ వద్ద ఎమ్యెల్యే గాంధీపై జనం తిరగబడ్డారు.  ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పాలని ఆందోళనకు దిగారు. ఇన్నాళ్లు కనపడని రైతు కష్టాలు.. ఇప్పుడే కనిపించాయా? అంటూ ఓ మహిళ నిలదీసింది. తమకు ఇబ్బందులకు గురి చేసి బారికేడ్లు పెట్టడం ఏంటని ప్రజలు ప్రశ్నించారు.

కూకట్ పల్లిలో బంద్ నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నాయకులు.. వాహనదారులకు మధ్య గొడవ జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు, వాహనదారులను అడ్డుకోవడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. 

ఆఫీసులకు వెళ్లే తమను అడ్డుకోవడంపై వాహనదారులు మండిపడ్డారు. 11 గంటల నుంచి బంద్ అని చెప్పి ఉదయమే వాహనాలను అడ్డుకుంటే తాము ఆఫీసులకు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. తాము కూడా రైతులకు మద్దతుగానే ఉన్నామని, ఇలా బలవంతంగా అడ్డుకోవడం సరికాదని అంటూ నేతలను నిలదీశారు.

ఇలా ఉండగా, రైతులను మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. రైతుల భూములను కబ్జా చేసి వెంచర్లు వేసిన ఘనత మంత్రి కేటీఆర్‌దని ధ్వజమెత్తారు. రైతు చట్టాన్ని అర్థం చేసుకోవడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని విచారం వ్యక్తం చేశారు.

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు ఎంతో మేలు చేసేవని రాజాసింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు మధ్యవర్తులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని ఎదుర్కొలేకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.