బీజేపీలో మహిళా పైలట్‌ అజ్మీరా బాబీ   

బీజేపీలో మహిళా పైలట్‌ అజ్మీరా బాబీ   

మాజీ ఎంపీ విజయశాంతితో పాటు తెలంగాణ తొలి మహిళా పైలట్‌ అజ్మీరా బాబీ కూడా బీజేపీలో చేరారు. విజయశాంతి గతరాత్రి  పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి తక్కువైందని, అవినీతి ఎక్కువైందని ఈ సందర్భంగా విజయశాంతి  ఆరోపించారు. బీజేపీతోనే అవినీతి అంతం సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య అవగాహన ఉందన్నది అందరికీ తెలుసని, కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో కాంగ్రెస్‌ నేతలు నడుచుకుంటున్నారని ఆమె విమర్శించారు. 

కాగా, విజయశాంతి 20 సంవత్సరాల తర్వాత మళ్లీ బీజేపీకి సేవ చేయడానికి రావడం హర్షనీయమని పార్టీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. 1998లో విజయశాంతి బీజేపీలో చేరిన సందర్భంగా పార్టీ అగ్రనేత ఎల్‌.కె. అడ్వాణీ నివాసంలో సమావేశమైన ఫోటోను ఆయన షేర్‌ చేశారు.

మరోవంక, , తెలంగాణ కాంగ్రెస్‌ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆ పార్టీకి గుడ్‌ బాయ్‌ చెప్పి బీజేపీలో చేరారు. జేపీ నడ్డా ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో రాష్ట్ర పార్టీ నేతల చేతుల మీదుగా నారాయణరెడ్డి బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందుకోనున్నారు