టీఆర్ఎస్ మంత్రులను హౌస్ అరెస్టు చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు నిరసనలు తెలియజేసే అవకాశం లేకుండా చేసిన టీఆర్ఎస్ మంత్రులను ముందు హౌస్ అరెస్ట్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశారు.  రైతులను తప్పుదోవ పట్టించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. 
 
రైతులకు వ్యతిరేకంగా ఒక్కపదం కూడా చట్టంలో లేదని ఆమె స్పష్టం చేశారు.  రైతులకు మేలుచేసే చట్టాలని ప్రధాని చెప్పినా కుట్రతో ఆందోళనలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. సన్నరకం వడ్లు పండించిన రైతులకు కేసీఆర్ ఇంకా న్యాయం చేయలేదని ఆమె ధ్వజమెత్తారు.  
 
రైతులకు భరోసా కల్పించకుండా అపోహలు సృష్టిస్తున్నారని ఆమె విమర్శించారు. తెలుగు రాష్ట్రాల రైతులు అపోహలు నమ్మొద్దని ఆమె కోరారు. నేరుగా నిరసనలకు పిలుపివ్వడానికి సీఎం కేసీఆర్ కు సిగ్గుందా అని ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్షాలు నిరసనలు తెలిపే అవకాశం లేకుండా చేసిన వ్యక్తి కేసీఆర్ ఇప్పుడు ఆయనే బంద్ పాటించమంటున్నారని అరుణ ఎద్దేవా చేశారు. ముందుగా టిఆర్ఎస్ మంత్రులు, వారి నాయకులను హౌస్ అరెస్ట్ చేయాలని అరుణ డిమాండ్ చేశారు.
 
కాగా, వ్యవసాయరంగాన్ని ఆదుకునేందుకే కేంద్రం కొత్త చట్టాలు తెచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులు తమ ఉత్పత్తులు నచ్చిన చోట నచ్చిన ధరకు అమ్ముకునే వీలుందని చెప్పారు. రైతుల పంటలను కొనుగోలు చేసే వారిలో పోటీతత్వం కోసమే కొత్త చట్టం తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. 
 
టీఆర్‌ఎస్‌ స్వార్థ ప్రయోజనాల కోసమే కొత్త చట్టాలను వ్యతిరేకిస్తోందని విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వమే బంద్‌లో పాల్గొనాలనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ బంద్‌ను తిప్పికొట్టాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.